ఇది కాంగ్రెస్ పార్టీ కాదు శైలజానాథ్... కాస్త జాగ్రత్త!
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతుంటారు. ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చని అంటుంటారు.
By: Tupaki Desk | 13 Feb 2025 12:30 PM GMTకాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెబుతుంటారు. ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చని అంటుంటారు. పైగా అది జాతీయ పార్టీ కావడంతో.. రకరకాల మనుషులు, రకరకాల అభిప్రాయాలు ఉండటం సహజం. అయితే.. రీజనల్ పార్టీల విషయంలో అలా ఉండదు. పార్టీ నాయకుడి అభిప్రాయాలను గౌరవిస్తూ, ఆయన చెప్పినట్లు, ఆయనకు నచ్చినట్లు నడుచుకోవాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. ఆ పార్టీ కష్టాలకు, నష్టాలకు, సంతోషాలకూ, సుఖాలకూ అన్నింటికీ ఆయనే బాధ్యుడు! అయితే ఈ విషయం మరిచారో.. లేక, పాత పార్టీ అలవాటుల్లో భాగంగా అనేశారో తెలియదు కానీ.. నిన్న గాక మొన్న పార్టీలో చేరిన శైలజానాథ్.. ఓ అభిప్రాయం వెల్లడించారు. ఇందులో భాగంగా... వైఎస్ విజయమ్మ వైసీపీ బాధ్యతలు తీసుకోవాలని అన్నారు.
అవును... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. స్వయంగా జగన్ మోహన్ రెడ్డి.. శైలజానాథ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. అలా పార్టీలో చేరి ఇంకా వారం కూడా కాలేదు. ఇంతలోనే జగన్ కు చికాకు తెప్పించే మాట ఒకటి మాట్లాడారు. దీంతో.. ఎందుకొచ్చిన మాటలు శైలజానాథ్ అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.
అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన శైలజానాథ్... వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తమకు ఆరాధన భావం ఉందని.. అన్నదమ్ములు, అన్నాచెల్లెళ్ల మధ్య ఇటువంటి పరిణామాలు ఉండకుడదని వైఎస్సార్ అభిమానులుగా బాదపడుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో.. ఇలాంటి పరిణామాలను ఎక్కడో ఓ చోట ముగించాలని కోరుకుంటున్నామని అన్నారు.
దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై జగన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారని అంటున్నారు. అలాంటి కోరికలు, సూచనలు, అభిప్రాయాలు ఏమైనా ఉంటే.. జగన్ ని వ్యక్తిగతంగా కలిసినప్ప్డు చెప్పాలి కానీ.. ఇలా మైకుల ముందు ఏది బడితే అది మాట్లాడకూడదని.. ఈ విషయం మరిచిపోవద్దని చెబుతున్నారు.
కాగా.. ప్రస్తుతం విజయమ్మ, షర్మిలతో జగన్ న్యాయపోరాటంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయమ్మ, షర్మిల.. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో సరస్వతి పవర్ లో వాటాల బదిలీకి సంబంధించి జగన్ చేసిన వాదనలను వ్యతిరేకిస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా.. తను తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నట్లు విజయమ్మ తెలిపారు!
వాస్తవ పరిస్థితితులు ఇలా ఉంటే... శైలజానాథ్ ఏకంగా విజయమ్మను వైసీపీ పగ్గాలు తీసుకోవాలని కోరడం.. కచ్చితంగా జగన్ కు చికాకు తెప్పించే అభిప్రాయమే అని అంటున్నారు.