అతడి ఆత్మవిశ్వాసానికి సలాం
అలాంటిది రెండు చేతులు లేకున్నా కూడా.. మిగిలిన వారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పని చేస్తున్న ఈ యువకుడి పేరు జాకీర్ పాషా.
By: Tupaki Desk | 9 Jan 2024 4:40 AM GMTఆత్మవిశ్వాసం అచ్చెరువు చెందే ఇతడిని చెప్పాలి. పుట్టుకతో రెండు చేతులు లేకుండా పుట్టినప్పటికి.. ఏ మాత్రం వేదన చెందకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనే తపన ఉన్న ఇతడ్ని చూస్తే వావ్ అనటమే కాదు.. సలాం చేయకుండా ఉండలేం. ఒక చెయ్యి లేకుండానే ఉండటాన్నే జీర్ణించుకోలేం. అలాంటిది రెండు చేతులు లేకున్నా కూడా.. మిగిలిన వారికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పని చేస్తున్న ఈ యువకుడి పేరు జాకీర్ పాషా.
పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా పుట్టినప్పటికీ.. నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో అతగాడు ఎంకాం (పీజీ) పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్సుల్ని చేశాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలన్న అతడి పట్టుదలకు తోడుగా.. తనకు లభించిన చిన్న అవకాశాన్ని సైతం వదిలిపెట్టకుండా వ్యవహరిస్తున్న ఇతడి తీరును చూస్తే వావ్ అనకుండా ఉండలేం. కాగజ్ నగర్ కు చెందిన ఇతడు.. తాజాగా రేవంత్ సర్కారు షురూ చేసిన ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల వర్కుకు ఎంపికయ్యాడు.
కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు మొత్తం 15,230 అప్లికేషన్లు వచ్చాయి. వాటిని ఒక క్రమపద్దతిలో సిద్ధం చేసేందుకు వీలుగా 30 మంది కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. ఈ 30 మందిలో ఒకరు జాకీర్ పాషా. రెండు చేతులు లేకున్నా.. అతడి ఆత్మవిశ్వాసానికి ముగ్దుడై..అతడ్ని అపరేటర్ గా ఎంపిక చేశారు. అంచనాలకు మించి.. ల్యాప్ టాప్ ను రెండు కాళ్లతో ఆపరేట్ చేస్తూ.. చకచకా పని చేస్తున్నాడు. జాకీర్ ను చూసినోళ్లంతా అతడ్ని అభినందిస్తున్నారు. ఇలాంటి వారిని.. ప్రభుత్వం ప్రోత్సహించి.. ఉద్యోగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే జాకీర్ లాంటి వారిని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తించటమే కాదు.. అతడి సర్కారు కొలువు కలను తీరుస్తారని ఆశిద్దాం.