Begin typing your search above and press return to search.

సర్కారు మారితే ఉద్యోగులకు బంపరాఫరే.. సిరియాలోనూ అంతే

సిరియాలో 50 ఏళ్ల పాటు బషర్ కుటుంబ పాలన సాగింది. అసద్ అల్ బషర్ ప్రభుత్వంపై 2011లో తిరుగుబాటు మొదలైంది.

By:  Tupaki Desk   |   6 Jan 2025 1:30 PM GMT
సర్కారు మారితే ఉద్యోగులకు బంపరాఫరే.. సిరియాలోనూ అంతే
X

ఏ దేశంలోనైనా ప్రభుత్వానికి దాని ఉద్యోగులే పెద్ద సంపద. ఆయా ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగులే వారథులు. అందుకే వారిని మచ్చిక చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తుంటారు. ఆర్థికంగా బాగా ఉన్న దేశాల్లో ఇది వర్క్ అవుట్ అవుతుంది. మరి శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వే వంటి దేశాల్లో..? ఇక 15 ఏళ్లుగా తీవ్ర అంతర్యుద్ధంలో ఉన్న సిరియాలో..?

50 ఏళ్ల నియంత పాలన పోయి..

సిరియాలో 50 ఏళ్ల పాటు బషర్ కుటుంబ పాలన సాగింది. అసద్ అల్ బషర్ ప్రభుత్వంపై 2011లో తిరుగుబాటు మొదలైంది. ఈ ప్రయత్నం అప్పట్లో విఫలమైంది. కానీ, 40 శాతం దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోనే ఉంది. చివరకు డిసెంబరులో రోజుల వ్యవధిలోనే వారు రాజధాని డమాస్కస్ కు చేరుకోవడంతో.. అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోయారు.

ఆయన ఎక్కడున్నారు?

సిరియా అసద్ దేశం విడిచి వెళ్లేలా రష్యా సహకరించింది. ఆయన కుటుంబంతో సహా ప్రవాసంలోకి వచ్చేందుకు రష్యా విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో అసద్ ఇప్పుడు రష్యాలోనే ఆశ్రయం పొందుతున్నారు. కాగా, అసద్ పరారీ అనంతరం సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ప్రభుత్వానికి సహకరించే దేశాలు ఏమిటా? అనే చర్చ మొదలైంది. అయితే, ఆర్థిక సాయం చేస్తామని అరబ్‌ దేశాలు హామీ ఇచ్చాయి.

ఉద్యోగులకు పండుగే..

సిరియా కొత్త ప్రభుత్వం తమ ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతోంది. అది కూడా ఎవరూ ఊహించని విధంగా 400 శాతం పెంచనుందట. ఆర్థిక మంత్రి మహమ్మద్‌ అబ్జాద్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 1.65 ట్రిలియన్‌ సిరియన్ పౌండ్ల వేతనాలను దేశీయ వనరుల నుంచి సమకూర్చనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం కోసమేనని చెప్పారు. వాస్తవానికి సిరియాలో 15 ఏళ్లు అంతర్యుద్ధం జరుగుతోంది. ఒకప్పుడు పశ్చిమాసియాలోనే సంపన్న దేశమైన సిరియా తీవ్ర ఆర్థిక సవాళ్లలో చిక్కుకుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం విదేశాల్లోని తమకు చెందిన 400 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను విడిపించుకొనే ప్రయత్నం చేస్తోంది.