తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు.. అస్సలు నమ్మబుద్ధి కావట్లేదట
కానీ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.
By: Tupaki Desk | 2 Feb 2024 7:55 AM GMTపోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో.. సమైక్య పాలకులకు మించినట్లుగా ఉంటుందని ఆశించిన వారికి నిరాశకు గురి చేసేలా కేసీఆర్ సర్కారులో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు పడేవి అన్నది ఒక ప్రశ్నగా ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకటో తారీఖు లేదంటూ మొదటి మూడు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడేవి. కానీ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి.
ఎప్పుడు జీతాలు పడతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్న పరిస్థితి. ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించే విషయంలో కేసీఆర్ సర్కారు పెద్దగా పట్టించుకునేది కాదు. దీంతో వేలాది మంది ఉద్యోగులు ప్రతి నెలా ఇబ్బందులకు గురయ్యే వారు. రేవంత్ సర్కారు ఏర్పడిన నెలలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో నెల మొదటి రోజున (అంటే ఫిబ్రవరి 1న) జీతాలు పడటంతో చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎన్నో ఏళ్లుగా ఇలాంటి రోజు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు తాజా పరిణామం కొత్త అనుభవాన్నికలిగించింది. అందుకే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. తన అనుభవాన్ని వెల్లడించటం ద్వారా తెలంగాణలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ‘‘ఒకటో తేదీనే వేతనాలు జమ కావటాన్ని నా భార్య కూడా నమ్మడం లేదు’’ అంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగి ముఖ్యమంత్రి రేవంత్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
ఈ ఉద్యోగి ట్వీట్ ను ఉటంకిస్తూ సీఎం కార్యాలయం తాజాగా స్పందించింది. ఒక ప్రకటనను విడుదల చేస్తూ.. ఉద్యోగులకు కొన్ని జిల్లాల్లో ఒకటో తేదీనే వేతనాలు అందాయి అని పేర్కొనటం ద్వారా.. తమ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో చేతల్లో చూపారు. అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి ఒకటో తేదీన జీతాలు వేయాలంటే మరింత కసరత్తు చేయాలని.. అందుకు కనీసం ఆర్నెల్లు సమయం పడుతుందని పేర్కొనటం గమనార్హం.