మేమే మిమ్మలిన కొంటాం.. 10 శాతం ధరకే.. మస్క్ కు ఆల్ట్మన్ గట్టి షాక్
అనేక మలుపుల అనంతరం దాదాపు మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమం ట్విటర్ ను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Feb 2025 1:30 PM GMTఅనేక మలుపుల అనంతరం దాదాపు మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమం ట్విటర్ ను అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో దానికి ఆయన పెట్టిన ఖర్చు రూ.3.50 లక్షల కోట్లు. ఇప్పుడు రూ.4 లక్షల కోట్లు అయినా ఉంటుంది అనుకుందాం.. కానీ ఇప్పుడు దీనిని రూ.87 వేల కోట్లకు అమ్మేయమంటున్నారు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్. మస్క్ కు ఈ మేరకు ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేంటి రూ.4 లక్షల కోట్ల సంస్థను రూ.87 వేల కోట్లకు అడగడం ఏమిటి? అనుకుంటున్నారా? ఇదంతా ఎందుకొచ్చింది? అనుకుంటున్నారా? ఓపెన్ ఏఐను కొంటానంటూ మస్క్ బయల్దేరడంతోనే దానిని స్థాపించిన ఆల్ట్ మన్ ఈ విధంగా రిప్లయ్ ఇచ్చారు..
మస్క్ గురించి అందరికీ తెలిసేంద.. టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఆయన. మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల టీమ్.. ఓపెన్ ఏఐను 97.4 బిలియన్ డాలర్లకు (రూ. 8.46 లక్షల కోట్లు) కొంటామంటూ ప్రతిపాదించింది. దీంతోనే ఆల్ట్మన్ కు చిర్రెత్తింది. అందుకని తనదైన శైలిలో గట్టి పంచ్ లేశారు.
మస్క్ ఎక్స్ లోనే ట్వీట్ తో
‘‘మీ ఆఫర్ కు ధన్యవాదాలు. మీరు కోరుకుంటే మేమే ట్విట్టర్ ను 9.74 బిలియన్ డాలర్లకు (రూ.87 వేల కోట్లు) కొంటాం’’ అంటూ మస్క్ కు చెందిన ఎక్స్ (గతంలో ట్విటర్)లో ట్వీట్ చేశారు. ఇది కాస్త వైరల్ అయి.. మస్క్ మామకు గట్టిగానే కౌంటర్ తగిలిందే అని సంబరపడుతున్నారు.
మస్క్ సారథ్యంలోని వై క్యాపిటల్, జై వంటి సంస్థలు ఓపెన్ ఏఐలో పెట్టుబడులకు బిడ్ వేశాయి. ఆసక్తి కలిగిన ఇతర పెట్టుబడిదారులు, హాలీవుడ్ పవర్ బ్రోకర్ అరి ఇమాన్యుయేల్ సైతం భాగస్వాములు అయ్యారు. ఈ బిడ్.. ఓపెన్ ఏఐపై వస్తున్న పెద్ద ఒప్పందాలను దెబ్బతీయడంతో పాటు, దాని మార్కెట్ విలువను ప్రభావితం చేసే ప్రమాదం ఏర్పడింది.
కాగా, ఆల్ట్మన్ పెట్టిన పోస్ట్ మస్క్ కు గట్టిగా తగిలినట్లుంది. ‘మోసగాడు’ అంటూ సామ్ పై ఘాటు విమర్శలు చేశారు.
కాగా, ఓపెన్ ఏఐకి చెందినదే చాట్ జీపీటీ అనే సంగతి తెలిసిందే. ఇది 2022 నవంబరులో వచ్చింది. కేవలం 6 నెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది. 2015లో ఓపెన్ ఏఐను ఆల్మన్ బృందం స్థాపించినప్పుడు మస్క్ కూడా పెట్టుబడులు పెట్టారు. 2018లో బయటకు వచ్చేశారు. 2019లో మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చి.. ఓపెన్ ఏఐలో 14 బిలియన్ డాలర్లు పెట్టింది. అయితే, కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారంటూ ఓపెన్ ఏఐ, మైక్రో సాఫ్ట్ పై మస్క్ నిరుడు దావా వేశారు.
మస్క్ ట్విటర్ ను 2022 అక్టోబరులో 44 బిలియన్ డాలర్లతో కొని ఎక్స్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సరిగ్గా నెల రోజులకు చాట్ జీపీటీ వచ్చింది. మార్కెట్ ను దున్నేస్తోంది.