ఎంపీ ఇంటి కరెంట్ బిల్లు సున్నా... పోలీసులతో విద్యుత్ శాఖ అటాక్!
సామాన్య సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకే కరెంట్ బిల్లులు వేలల్లో వస్తున్నాయంటూ చాలా మంది వాపోతుంటారని అంటుంటారు.
By: Tupaki Desk | 19 Dec 2024 11:05 AM GMTసామాన్య సింగిల్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకే కరెంట్ బిల్లులు వేలల్లో వస్తున్నాయంటూ చాలా మంది వాపోతుంటారని అంటుంటారు. అలాంటిది ఒక ఎంపీ గారి ఇంటికి ఇటీవల కరెంట్ బిల్లు సున్నాకు వచ్చిందంట. దీంతో ఫస్ట్ షాక్ తిని, అనంతరం సీరియస్ గా మారిన విద్యుత్ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు!
అవును... ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో విద్యుత్ మీటర్ ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానంతో ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కే ఇంటిపై విద్యుత్ శాఖ బృందం దాడులు నిర్వహించడం వైరల్ గా మారింది. దాడులు నిర్వహించడం ఒకెత్తు అయితే.. అందుకు తీసుకున్న భద్రతా చర్యలు మరొకెత్తు అని అంటున్నారు.
ఇందులో భాగంగా... ఏఎస్పీ, పోలీసు బలగాలు, ఆర్.ఆర్.ఎఫ్.తో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఎస్పీ ఇళ్లు ఉన్న కాలనీలో పోలీసుల కవాతుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ రకంగా ఎంపీ ఇంటికి చేరుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది.. కనెక్షన్లు, మీటర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు.
దీనికి కారణం ఎంపీ నివాసానికి సంబంధించి కరెంట్ బిల్లు సున్నా రావడమేనని అంటున్నారు. అది ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు ఆ మీటర్లను తనిఖీ చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో సుమారు గంటపాటు జరిగిన విచారణ అనంతరం సదరు టీమ్ తిరిగి రాగా.. పోలీసు బలగాలు మాత్రం ఇప్పటికే అక్కడే మొహరించాయని అంటున్నారు.
విషయం ఏమిటంటే.... సదరు ఎంపీ ఇంటికి రెండు విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయంట. ఇవి ఒక్కొక్కటీ నాలుగు కిలోవాట్ల కెపాసిటీ కలిగినవట. అయితే... ఇందులో ఒక మీటరు సుమారు ఐదు నెలలు, మరో మీటరు ఏడు నెలల పాటు స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారంట. ఫలితంగా... సున్నా రీడింగులు నమోదయ్యాయని అంటున్నారు.
దీంతో... ఇప్పుడున్న పాత మీటర్లను ల్యాబ్ పరీక్షలకు పంపిన విద్యుత్ శాఖ అధికారులు.. వాటి స్థానంలో ఇంటి వద్ద కొత్త స్మార్ట్ మీటర్లను అమర్చి పరీక్షించారంట. దీంతో.. ఒక మీటర్ పై జీరో లోడ్ ఉండగా.. మరో మీటర్ పై 5.9 కిలోవాట్ల లోడ్ నమోదైనట్లు చెబుతున్నారు.
ఈ సమయంలో... విచారణ నివేదిక ఆధారంగా విద్యుత్ శాఖ తదుపరి చర్యలు తీసుకోనుందని అంటున్నారు. విద్యుత్ చౌర్యం కేసులో ఎంపీ రెహమాన్, అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు!