నోరు జారనేల .. దీక్ష పట్ట నేల ?!
‘‘నేను అనుకోకుండా ఈ తప్పు చేుశాను. కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు.
By: Tupaki Desk | 21 May 2024 5:29 AM GMT‘‘అడుసు తొక్కనేల .. కాలు కడగ నేల’’ అని సామెత. ఒడిశాలోని పూరి పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సంధర్భంగా బీజేపీ నేత సంబిత్ పాత్ర మాట్లాడుతూ ‘‘ఈ పురాతన పట్టణంలో కొలువదీరిన పూరీ జగన్నాథుడు ప్రధాని నరేంద్రమోడీ భక్తుడని’’ అన్నాడు. ఆడిన మాట, పోయిన కాలం వెనక్కి రావు. అసలే ఎన్నికల కాలం సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై బీజేడీ తీవ్రంగా విరుచుకుపడుతున్నది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
అయితే, తాను జగన్నాథుడిపై ప్రధాని మోడీకి ఉన్న భక్తి గురించి చెప్పే ప్రయత్నంలో పొరపాటున జగన్నాధుడు మోడీ భక్తుడు అని పొరపాటున అన్నానని సంబిత్ పాత్ర వివరణ ఇచ్చాడు. పూరీలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో తర్వాత, నేను చాలా మీడియా ఛానెల్‌లకు బైట్ ఇచ్చాను, ప్రధాని నరేంద్ర మోడీ మహాప్రభు జగన్నాథ భక్తుడని ప్రతిచోటా అదే మాట చెప్పాను, అయితే అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యాను అని అన్నాడు.
‘‘నేను అనుకోకుండా ఈ తప్పు చేుశాను. కానీ దేవుడు అనుకోకుండా చేసిన తప్పుల్ని క్షమిస్తాడు. దీనికి పశ్చాత్తాపంగా జగన్నాథుడి కోసం ఉపవాస దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని సంబిత్ పాత్ర ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో సంబిత్ పాత్ర వ్యాఖ్యలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి వ్యాఖ్యలు మహాప్రభు జగన్నాథుడి పవిత్రతను దెబ్బతీస్తాయని అన్నారు. ఇది లక్షలాది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, రాజకీయాల్లోకి దేవతలను లాగడం మానుకోవాలని బీజేపీని’’ కోరారు.