Begin typing your search above and press return to search.

షారూఖ్ కొడుకు కేసు పోలీసుకి శిందే టికెట్.. మురికివాడ నుంచి పోటీ

వాంఖడే తదితరులపై అంతర్గత విజిలెన్స్ విచారణ జరిగింది. రూ.25 కోట్లు డబ్బు డిమాండ్ చేశారని వాంఖడేపై అభియోగాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:00 AM GMT
షారూఖ్ కొడుకు కేసు పోలీసుకి శిందే టికెట్.. మురికివాడ నుంచి పోటీ
X

సరిగ్గా మూడేళ్ల కిందట బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో పట్టుబడడం ఎంతటి సంచలనం రేపిందో అందరూ చూశారు. 2021 అక్టోబరు 2 న కార్డెలియా క్రూయిజ్ షిప్‌లో జరిగిన పార్టీలో డగ్స్ వాడకం ఆరోపణలు రావడం.. అప్పటి నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడే ఏకంగా ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 14 మంది నిందితులపై డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత ఆర్యన్‌ కు క్లీన్ చిట్ వచ్చింది. ఎన్సీబీ పట్టుకున్న క్రూయిజ్ పార్టీ డ్రగ్స్ కేసు తర్వాత అనేక మలుపులు తిరిగింది. వాంఖడే తదితరులపై అంతర్గత విజిలెన్స్ విచారణ జరిగింది. రూ.25 కోట్లు డబ్బు డిమాండ్ చేశారని వాంఖడేపై అభియోగాలు వచ్చాయి.

పోటీ ఎక్కడినుంచి అంటే?

ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్ వాంఖడే రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధారవి నుంచి సీఎం ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన టిక్కెట్‌పై పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్దదైన ధారవి మురికివాడ ఈ ప్రాంతంలోనిదే కావడం గమనార్హం. వాంఖడే 2008 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. 2021 వరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జోనల్ డైరెక్టర్‌ గా పనిచేశారు. ఈయన నేతృత్వంలోని బృందమే షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ సంబంధిత ఆరోపణలపై అరెస్టు చేసింది. ఆర్యన్ ను ఈ కేసు నుంచి తప్పించేందుకు రూ.25 కోట్ల లంచం కోరిన ఆరోపణలపై వాంఖడేపై సీబీఐ గత ఏడాది మేలో కేసు నమోదు చేసింది. ఎన్‌సిబి నుంచి వచ్చిన ఫిర్యాదుపై అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలతో వాంఖడే తదితరులపై కేసు నమోదైంది.

కాగా, ధారవి నుంచి జ్యోతి గైక్వాడ్ కాంగ్రెస్ టికెట్‌ పై పోటీ చేయవచ్చని చర్చ జరుగుతోంది. వాంఖడే టిక్కెట్టు దక్కించుకుంటే జ్యోతి గైక్వాడ్ తో తలపడాల్సి ఉంటుంది. ఇక ఐఆర్ఎస్ సర్వీసుకు వాంఖడే ఇంకా రాజీనామా చేయలేదు. తన కెరీర్ లో ఎన్నో పెద్ద కేసులను చేపట్టిన వాంఖడే.. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి వస్తున్నారు.