Begin typing your search above and press return to search.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాలు ఇవే!

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Oct 2023 12:45 PM GMT
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన దేశాలు ఇవే!
X

స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత విషయంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కాలకు దేశంలో ఇంతవరకు గుర్తింపు లేదు, ఈ నేపథ్యంలో స్వలింగ సంప్కరాలను గుర్తించాలని 23 గే, లెస్బియన్స్‌ జంటలు వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు నాలుగు వేర్వేరు తీర్పులు ఇచ్చింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైనదనే అభిప్రాయాన్ని సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని కోర్టు అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 10 రోజులు పాటు సుదీర్ఘ విచారణ చేపట్టి.. మే 11న తన తీర్పును రిజర్వు చేసింది. తాజాగా తన తీర్పును ప్రకటించింది.

వివాహ వ్యవస్థ అనేది ‘స్థిరమైనదని, దాన్ని మార్చలేమని’ అనుకోవడం సరికాదని కోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్రపు పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని పేర్కొంది. అయితే, ప్రత్యేక వివాహ చట్టం అవసరమా లేదా అనేది పార్లమెంట్‌ నిర్ణయిస్తుందని వెల్లడించింది. దీని చట్టపరిధిలోకి కోర్టు వెళ్లాలనుకోవట్లేదని వ్యాఖ్యానించింది.

లైంగిక ధోరణి కారణంగా ఆ వ్యక్తులు బంధంలోకి వెళ్లే హక్కును నియంత్రించకూడదని సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

వివాహేతర జంటలతో పాటు స్వలింగ సంపర్కం చేసే జంటలు కూడా బిడ్డలను దత్తత తీసుకోవచ్చని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వెల్లడించారు. భిన్న లింగాల జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని భావించనక్కరలేదన్నారు.

ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలు అధికారాల విభజనకు అడ్డంకి కాదని చెప్పారు. ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపిన సీజేఐ.. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు.

కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇరవై మూడు దేశాలు దేశవ్యాప్త ఓటింగ్‌ తర్వాత స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేశాయి. మరో 10 దేశాలు కోర్టు తీర్పుల మేరకు చట్టబద్ధం చేశాయి. ఇప్పటివరకు ఈ సేమ్‌ సెక్స్‌ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా ఎస్టోనియా (2024) నిలిచింది.

కాగా మానవ హక్కుల ప్రచార వేదిక ప్రకారం..చెక్‌ రిపబ్లిక్, జపాన్, ఫిలిప్పీన్స్‌ , థాయ్‌లాండ్‌ ల్లో కూడా వివాహ సమానత్వంపై చర్చలు జరుగుతున్నాయి.

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత ఉన్న దేశాలు ఇవే..

2001: నెదర్లాండ్స్,

2003: బెల్జియం

2005: కెనడా, స్పెయిన్‌

2006: దక్షిణాఫ్రికా

2009: నార్వే, స్వీడన్‌

2010: ఐస్లాండ్, పోర్చుగల్,అర్జెంటీనా

2012: డెన్మార్క్‌

2013: ఉరుగ్వే, న్యూజిలాండ్‌: ఫ్రాన్స్, బ్రెజిల్‌

2014: ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్, స్కాట్లాండ్‌

2015: లక్సెంబర్గ్, ఐర్లాండ్, అమెరికా

2016: గ్రీన్‌ల్యాండ్, కొలంబియా

2017: ఫిన్లాండ్, జర్మనీ, మాల్టా, ఆస్ట్రేలియా

2019: ఆస్ట్రియా, తైవాన్, ఈక్వెడార్‌

2020: ఐర్లాండ్,కోస్టారికా

2022: స్విట్జర్లాండ్, మెక్సికో, చిలీ, స్లోవేనియా, క్యూబా

2023: అండోరా

2024: ఎస్టోనియా