వైసీపీ.. మరో బిగ్ వికెట్ డౌన్!
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది.
By: Tupaki Desk | 20 Sep 2024 10:07 AM GMTవైసీపీ కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఒక్క రోజు కూడా గడవకముందే ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పంపారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా తనకు వైసీపీలో గుర్తింపు రాలేదని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పార్టీ అన్యాయం చేసిందని తెలిపారు. తాను ఈ నెల 22 జనసేన పార్టీలో చేరుతున్నానన్నారు. జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే వైసీపీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు.
కాగా ఇప్పటికే ఉదయభాను గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. జనసేన పార్టీలో చేరడానికి తన ఆసక్తిని తెలిపారు. తనతోపాటు కొందరు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీల సర్పంచులు జనసేనలో చేరతారని వెల్లడించారు.
కాగా వైఎస్ కుటుంబానికి సన్నిహితుడయిన ఉదయభాను తొలిసారి 1999లో జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 2009లో రాష్ట్రంలో కాం్రVðఃస్ అధికారంలోకి వచ్చినా ఉదయభాను మాత్రం ఓటమి పాలయ్యారు. 2014లో వైసీపీలోకి వచ్చి పోటీ చేసినా ఓడిపోయారు. 2019లో వైసీపీ తరఫున జగ్గయ్యపేటలో ఉదయభాను గెలుపొందారు. మొత్తం మీద ఆరుసార్లు పోటీ చేసిన ఉదయభాను మూడుసార్లు గెలిచి మరో మూడుసార్లు ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాం 2004–09 వరకు ఉదయభాను ప్రభుత్వ విప్ గా పనిచేశారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రభుత్వ విప్ గా విధులు నిర్వహించారు. మంత్రి పదవి కోసం ఆయన పేరు కూడా వినిపించినా దక్కలేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయబోనని చెప్పడంతో ఆయనకు జగన్ మంత్రిపదవి ఇవ్వలేదని టాక్ నడిచింది.
ఓడిన మూడుసార్లు ఉదయభానుపై టీడీపీ అభ్యర్థి రాజగోపాల్ శ్రీరాం (తాతయ్య) గెలుపొందారు. ఆయన గతంలో ఉదయభానుకు ముఖ్య అనుచరుడే కావడం గమనార్హం. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి ఉదయభాను, రాజగోపాల్ శ్రీరాం జగ్గయ్యపేట నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్ శ్రీరాం విజయం సాధించారు.
కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఉదయభానును ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారని తెలుస్తోంది. సామినేని రాకతో పార్టీ బలోపేతమవుతుందని అంటున్నారు.