Begin typing your search above and press return to search.

కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ షాక్...కీలక నేత గుడ్ బై ?

వైసీపీకి వరసబెట్టి కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీని ఇటీవల కాలంలో నేతలు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు.

By:  Tupaki Desk   |   11 Sep 2024 3:49 AM
కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ షాక్...కీలక నేత గుడ్ బై ?
X

వైసీపీకి వరసబెట్టి కష్టాలు వెంటాడుతున్నాయి. పార్టీని ఇటీవల కాలంలో నేతలు ఒక్కొక్కరుగా విడిపోతున్నారు. అది ఉభయ గోదావరి జిల్లాల నుంచి గుంటూరు కృష్ణా జిల్లాల దాకా సాగుతోంది. కోస్తాకు హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న ఈ ప్రాంతంలో టీడీపీ జనసేన ప్రభావం అధికంగా ఉంది.

దాంతో పాటు ఒక బలమైన సామాజిక వర్గం నేతలు వైసీపీలో ఉండలేకపోతున్నారు అని అంటున్నారు. వారే ఫిరాయిస్తున్న వారిలో ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోని కీలక నేతగా ఉన్న జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వైసీపీని తొందరలోనే వీడిపోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

సామినేని ఉదయభాను ఒకనాడు కాంగ్రెస్ కి చెందిన నాయకుడు. ఆయన 1999, 2004లలో రెండు సార్లు వరసగా జగ్గయ్యపేట నుంచి గెలిచి వచ్చారు. వైఎస్సార్ కి అతి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఆయన 2009లో వైఎస్సార్ మరణం తరువాత వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు 2014లో 2019లలో టికెట్లు ఇచ్చారు. అయితే 2014లో ఓడిన ఉదయభాను 2019లో గెలిచారు. ఆయనకు జగన్ విప్ పదవి ని ఇచ్చారు.

అయితే మంత్రి పదవి విషయంలో ఉదయభాను విస్తరణ సమయంలో కూడా ఆశలు పెట్టుకున్నారు. అది దక్కకపోవడంతో అపుడే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక ఆయన 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. కేవలం 15 వేల ఓట్ల తేడాతోనే ఆయనను అపజయం పలకరించింది.

ఇక పార్టీ ఓడిన తరువాత ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇపుడు సడెన్ గా ఆయన ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న కుటుంబ బంధం నేపథ్యంలో ఆయన ద్వారా జనసేనలో చేరేందుకు రాయబారం చేసినట్లుగా తెలుస్తోంది. అది దాదాపుగా ఫలించింది అని అంటున్నారు.

అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే మాత్రం ఉదయభాను తొందరలోనే వైసీపీ నుంచి జనసేనలోకి మారిపోతారు అని అంటున్నారు. జగ్గయ్యపేటలో బలమైన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత వైసీపీని వీడిపోతే మాత్రం అది భారీ షాక్ గానే చూడాలని అంటున్నారు. పైగా ఉదయభాను లాంటి వారు వైఎస్సార్ కుటుంబానికి విధేయులు. మరి ఆయన మారిపోతే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీకి సీనియర్ల కొరత కూడా ఏర్పడుతుంది అని అంటున్నారు. ఇక జనసేనలో చేరితే ఉదయభానుకు ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగిస్తారు అని తెలుస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.