'సామినేని'కి కొత్త సవాల్.. జగన్ నిర్ణయంతో షాక్!
ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, వైఎస్ అంటే ప్రాణం పెట్టే.. సామినేని ఉదయభానుకు ఈ దఫా వైసీపీ భారీ సవాల్‌నే భుజాలపై పెట్టిందనే ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Desk | 2 Jan 2024 1:30 AM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు ఉంటాయో తెలియదు. ఏనిముషానికి ఏం జరుగుతుందో అన్న ట్టుగా ఉంది.. ప్రస్తుత ఎన్నికల సీజన్. ముఖ్యంగా వైసీపీలో అయితే టికెట్ల వ్యవహారం మరింత ఆసక్తిగా మారింది. ఈక్వేషన్లు.. గెలుపు గుర్రారు.. ప్రజానాడి వంటి అనేక అంశాలను ప్రాతిపదికగా చేసుకుని అధికార పార్టీ మార్పులు.. చేర్పులు విస్తృతంగా చేస్తోంది. ఈ విషయంలో ఎవరూ ఊహించని విధంగా కూడా కూడా పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట ఎమ్మెల్యే, వైఎస్ అంటే ప్రాణం పెట్టే.. సామినేని ఉదయభానుకు ఈ దఫా వైసీపీ భారీ సవాల్‌నే భుజాలపై పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. సామినేని అంటే.. జగ్గయ్యపేటలో బలమైన నాయకుడు. గతంలో కాంగ్రెస్‌లోనూ, ఇప్పుడు వైసీపీలోనూ ఆయన విజయం దక్కించుకున్నారు. మంత్రి పదవికి కూడా ఆయన పేరును పరిశీలనకు తీసుకున్నా.. చివరి నిముషంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయనను తప్పించారు.
ఇలాంటి సామినేనికి ఇప్పుడు కొత్త సవాల్ ఎదురు కానుందనేది తాడేపల్లి వర్గాల మాట. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మారుస్తారని వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్న వైసీపీ ఇంత భారీ మార్పు దిశగా అడుగులు వేస్తుండడం నిజానికి సంచలనంగానే మారిందని అంటున్నారు. గతంలో ఎప్పుడూ.. తూర్పులో కానీ, విజయవాడ నగర పరిధిలోని మరో రెండు నియోజకవర్గాల్లో కానీ.. ఆయన పోటీ చేసిన పరిస్థితి లేదు.
పైగా.. వైసీపీ విజయవాడ నగర నాయకుల కంటే కూడా.. ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతోనే సామినేని ఎంతో చనువుగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయనను విజయవాడ తూర్పునకు పంపిస్తున్నారని.. దాదాపు టికెట్ ఖరారైందని ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఇక, విజయవాడ తూర్పులో టీడీపీకి బలమైన సామాజిక వర్గం అండ ఉంది. వరుస విజయాలు కూడా దక్కించుకుంటోం ది. ఇలాంటి సమయంలో వైసీపీ తీసుకోబోతోందంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.