Begin typing your search above and press return to search.

మంచి.. చెడు.. అసలు ఎవరీ పిట్రోడా? నోరు జారి రగడ..

ప్రత్యర్థి పార్టీకి ప్రచారాస్త్రం అవుతున్నాయి..? ఆయన గురించి ఒకసారి తెలుసుకుంటే..?

By:  Tupaki Desk   |   8 May 2024 2:30 PM GMT
మంచి.. చెడు.. అసలు ఎవరీ పిట్రోడా? నోరు జారి రగడ..
X

ఎన్నికల కాలంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలని మాట్లాడుతున్నాడా..? లేక వయో భారంలో ఒకటి అనుకుని ఇంకోటి అంటున్నాడా..? లేక ఎవరికైనా కోవర్టుగా మారాడా..? దారి తప్పిన మేధావి అయ్యాడా..? అసలు ఎవరాయన..? ఎందుకు ఆయన వ్యాఖ్యలు పదేపదే వివాదాస్పదం అవుతున్నాయి..? ప్రత్యర్థి పార్టీకి ప్రచారాస్త్రం అవుతున్నాయి..? ఆయన గురించి ఒకసారి తెలుసుకుంటే..?

‘‘అమెరికాలో వార‌స‌త్వ ఆస్తికి ప‌న్నులు వేస్తారు. ప్ర‌భుత్వ‌మే ఆ డబ్బు తీసుకుంటుంది’ ఇటీవల శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలివి. సరిగ్గా.. కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల సంప‌ద అంతా లాగేసుకుంటుదని, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి వాటిని పంపిణీ చేస్తుందని’’ ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా

ఈశాన్య రాష్ట్రాల ప్ర‌జ‌లు చైనీయుల్లా.. పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఉండేవారు.. ఆఫ్రిక‌న్‌ల మాదిరి (న‌ల్ల‌)గా ఉంటార‌ని వ్యాఖ్యానించారు. ఉత్త‌రాది వారు బ్రిటీష్ వారిలా క‌నిపిస్తార‌ని అన్నారు. భారతీయులు ఎవ‌రు ఎలా ఉన్నా.. ఐక్యంగా ఉండి.. దేశ ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షిస్తున్నార‌నేది పిట్రోడా భావం. వాస్తవానికి ఆయన భావం సరైనదే అయినా.. పోలిక గాడితప్పింది. ఇంకేం.. రగడ మొదలైంది. ఇలాంటి విషయాలను ఓట్లుగా మలుచుకోవడంలో, అందిపుచ్చకోవడంలో చాలా ముందుండే ప్రధాని మోదీ స్పందించారు. వర్ణం ఆధారంగా ప్రజలను కించపరిస్తే సహించేది లేదంటూ హెచ్చరికలకు దిగారు. అయితే, శామ్ పిట్రోడా మరీ అంత తేలికైన వ్యక్తా? అంటే కాదు. ఆయనొక మేధావి.

గుజరాత్ లో పుట్టి.. అమెరికాలో చదివి..

శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీకి బాగా సన్నిహితం. అందుకనే ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ రాజకీయంగా వాడుకుంటున్నారు. అయితే, శామ్ పిట్రోడా పూర్వీకులది గుజరాతే. 1942 మే4న పుట్టారు. అసలు పేరు సత్యనారాయణన్ గంగరామ్ పిట్రోడా. ఒడిశాలోని టిట్లాఘడ్ లో పుట్టారు. గాంధీజీకి ఆయన తల్లిదండ్రులు వీర భక్తులు. వీరే గుజరాత్ నుంచి ఒడిశాకు వలస వెళ్లారు. గాంధీ తత్త్వాన్నిఅవగాహన చేసుకునేందుకు శామ్, ఆయన సోదరుడిని తల్లిదండ్రులు గుజరాత్ పంపారు. శాం ఆనంద్ వల్లభ విద్యాలయలో ఉన్నత పాఠశాల చదువు, వడోదరా మహరాజా శాయాజీరావు వర్సిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్త్ట్రానిక్స్ లో డిగ్రీ చదివారు. అమెరికా వెళ్లి ఇల్లినాయి ఇన్ స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, షికాగోలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. 1960, 70ల్లో టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో పరిశోధనలు చేశారు. 1975లో శామ్ ఆవిష్కరించిన ఎలక్ట్రానిక్ డైరీ హ్యాండ్ కంప్యూటింగ్ లో విప్లవం.

ఇందిర హయాంలో భారత్ కు..

కంప్యూటర్ విప్లవం మొదలైన కొత్తలో 1984లో టెక్నాలజీ నిపుణుడిగా ఉన్న శామ్ పిట్రోడాను ప్రధాని ఇందిరా గాంధీ భారత దేశానికి ఆహ్వానించారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) ఆయన హయాంలో మొదలైందే. 1987 లో రాజీవ్ గాంధీ హయాంలో భారత స్వదేశీ విదేశీ టెలీకమ్యూనికేషన్ విధానాలకు రూపకల్పన చేశారు. చౌక ధరల్లో జాతీయ/ఆంతర్జాతీయ కాల్స్ చేసుకునే వీలుగా పసుపు పచ్చ రంగులోని పబ్లిక్ కాల్ ఆఫీస్ (ఎస్టీడీ బూత్)ల ఏర్పాటు ఆలోచన శామ్ పిట్రోడాదే. అయితే, రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఓడిపోయాక శామ్ అమెరికాలోని షికాగోకు వెళ్లిపోయారు. మళ్లీ 2004 లో రాహుల్ గాంధీ ఆహ్వానంతో విధాన సలహాదారుగా మారారు. యూపీఏ ప్రభుత్వంలో పిట్రోడాను నేషనల్ నాలెడ్జ్ సెంటర్ కు అధ్యక్షుడిగా నియమించారు.

పిట్రోడాను ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త, విధానాల రూపకర్త. భారత్ లో ప్రచార సాధనాల విప్లవానికి ఆద్యుడిగా పేర్కొంటారు. వరల్డ్ టెల్ లిమిటెడ్ కు ఛైర్మన్, సీఈవోగా చేశారు. శామ్ పలు టెక్నాలజీ పేటెంట్లకు హక్కదారు. కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా లెక్చర్లు ఇస్తుంటారు. 1992 లో ఐక్యరాజ్య సమితిలోనూ పనిచేశారు.