బెట్టింగ్ యాప్స్‌పై సంపూర్ణేశ్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
"హృదయ కాలేయం" సినిమాతో 'బర్నింగ్ స్టార్'గా గుర్తింపు పొందిన సంపూర్ణేశ్ బాబు, ఈ సినిమా తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని అన్నారు.
By: Tupaki Desk | 4 April 2025 2:07 PMనటుడు సంపూర్ణేశ్ బాబు బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనను కొందరు బెట్టింగ్ యాప్స్ కోసం సంప్రదించారని, అయితే వాటి గురించి అవగాహన లేకపోవడంతో ఆ ప్రమోషన్ల నుంచి తప్పుకున్నానని ఆయన తెలిపారు.
"హృదయ కాలేయం" సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంపూర్ణేశ్ బాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన బెట్టింగ్ యాప్స్ విషయంపై స్పందించారు. "నన్ను బెట్టింగ్ యాప్స్ కోసం కొంతమంది సంప్రదించారు. అయితే అప్పుడు నాకు దాని గురించి పూర్తిగా తెలియదు. అందుకే సమయం కావాలని అడిగాను. నా స్నేహితులతో ఈ విషయం చెప్పగా, వారు వద్దని సలహా ఇచ్చారు. ఆ తర్వాత వాళ్లు నన్ను సంప్రదించలేదు. అలా నేను ఆ ప్రమోషన్ల నుంచి బయటపడ్డాను" అని సంపూర్ణేశ్ బాబు వివరించారు.
"హృదయ కాలేయం" సినిమాతో 'బర్నింగ్ స్టార్'గా గుర్తింపు పొందిన సంపూర్ణేశ్ బాబు, ఈ సినిమా తన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని అన్నారు. దర్శకుడు సాయి రాజేశ్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "సినిమా కల సాకారం చేసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. వారిలో ఒకడిగా నాకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నరసింహా చారి అనే చిన్న పల్లెటూరి వ్యక్తిని సంపూర్ణేశ్ బాబుగా మార్చిన సాయి రాజేశ్ అన్నకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఆయన అన్నారు. సాయి రాజేశ్, ఆయన అమృత ప్రొడక్షన్స్ తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు.
"హృదయ కాలేయం" విడుదల సమయంలో దర్శకుడు రాజమౌళి చేసిన ట్వీట్ తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని సంపూర్ణేశ్ బాబు గుర్తు చేసుకున్నారు. రాజమౌళి ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరిస్తారని, ఆయన సినిమాలో అవకాశం వస్తే అంతకంటే ఏం కావాలని ఆయన అన్నారు. ఈ సినిమా సమయంలో సందీప్ కిషన్, మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారు తనకు ఎంతో సహకారం అందించారని ఆయన తెలిపారు.
11 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రేక్షకులు "హృదయ కాలేయం" గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని సంపూర్ణేశ్ బాబు అన్నారు. ఈ మధ్య కాలంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించానని, త్వరలో "సోదరా" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుందని, మరో రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కామెడీతో పాటు సీరియస్ పాత్రలు కూడా చేయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ, ఆ షోలో ఉండలేకపోయానని, తన లైఫ్ స్టైల్‌కు అక్కడి పరిస్థితులు సరిపోలేదని ఆయన అన్నారు. తన సంపాదనలో కొంత భాగాన్ని ఛారిటీకి ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తుందని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో అంతగా చురుకుగా ఉండనని, ఎవరైనా విమర్శించినా వాటిని పట్టించుకోనని ఆయన స్పష్టం చేశారు. కనీసం కారులో తిరగగలనా అని అనుకున్న తనకు "హృదయ కాలేయం" సినిమాతో ఫ్లైట్స్‌లో తిరిగే అవకాశం వచ్చిందని, త్వరలో మరిన్ని మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని సంపూర్ణేశ్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.