Begin typing your search above and press return to search.

ఇక భారత్‌ సముద్రయాన్‌!

మంగళయాన్, చంద్రయాన్‌ ప్రయోగాలతో భారత్‌ కీర్తిప్రతిష్టలు గగనాంతరాల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   12 Sep 2023 6:13 AM GMT
ఇక భారత్‌ సముద్రయాన్‌!
X

మంగళయాన్, చంద్రయాన్‌ ప్రయోగాలతో భారత్‌ కీర్తిప్రతిష్టలు గగనాంతరాల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సముద్రాన్ని కూడా ఒక పట్టు పట్టాలని భారత్‌ భావిస్తోంది. సముద్ర గర్భంలోనూ సంచలన విజయాలు నమోదు చేయాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సముద్రయాన్‌ ప్రాజెక్టుకు భారత్‌ శ్రీకారం చుడుతోంది.

ఈ మేరకు త్వరలో 'సముద్రయాన్‌' పేరిట సాగర అన్వేషణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి 'మత్స్య-6000' తుది మెరుగులు దిద్దుకుంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆ సబ్‌ మెరైన్‌ ఫొటోలు, వీడియోలను కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు విడుదల చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవసహిత జలాంతర్గామి అని ఆయన వెల్లడించారు. రిజిజు ఈ జలాంతర్గామిలో కూర్చున్నారు. దాని విశేషాలను నిపుణులు ఆయనకు వివరించారు.

కాగా చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ)... మత్స్య-6000ని రూపొందింది. ఈ ప్రయోగం సాకారమైతే ఇది భారత మొట్టమొదటి మానవసహిత సముద్ర అన్వేషణ మిషన్‌ గా ఇది నిలవనునంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా సముద్రంలో 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లొచ్చని అంటున్నారు.

మత్స్య-6000 సాగర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తొలుత ఇది సముద్రంలో 500 మీటర్ల లోతుకు మాత్రమే వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ మిషన్‌ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. సముద్రగర్భంలో అపార ఖనిజ నిల్వలున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే అరుదైన జీవజాలానికి సముద్ర గర్భం ఆలవాలం.

ఈ సముద్రయాన్‌ ప్రాజెక్టు ద్వారా ఆ ఖనిజాలను వెలికితెస్తే ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని అంటున్నారు. అంతేకాకుండా నూతన ఉద్యోగాల కల్పన కూడా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2026 నాటికి ఈ మిషన్‌ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ గతంలో వెల్లడించారు.