బంగ్లాదేశ్ లో తొలిసారి వీధుల్లోకి వచ్చిన లక్షలాది హిందువులు.. భారీ ర్యాలీ
అంతకంతకూ పెరిగిపోతున్న దాడులు.. తమ స్వేచ్ఛను హరిస్తున్న వారిపై ఇంతకాలం మౌనంగా ఉన్న బంగ్లాదేశ్ హిందువులు ఒక్కసారి వీధుల్లోకి వచ్చారు
By: Tupaki Desk | 27 Oct 2024 7:09 AM GMTఅంతకంతకూ పెరిగిపోతున్న దాడులు.. తమ స్వేచ్ఛను హరిస్తున్న వారిపై ఇంతకాలం మౌనంగా ఉన్న బంగ్లాదేశ్ హిందువులు ఒక్కసారి వీధుల్లోకి వచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పిన వారు.. తమకు జరుగుతున్న అన్యాయాలపై గళం వినిపించేందుకు బయటకు వచ్చిన వారి తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ ఇచ్చిన పిలుపుతో కదిలిన బంగ్లా హిందువులు.. మైనార్టీలుగా ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ తమ డిమాండ్లపై బంగ్లాదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే లక్షలాదిగా చిట్టగాంగ్ వీధుల్లోకి వచ్చిన తాము.. దేశ రాజధాని ఢాకా వైపు కవాతు చేస్తామని వారు స్పష్టం చేశారు. చారిత్రక లాల్‌డిఘి మైదానంలో చేపట్టిన ఈ నిరసన ర్యాలీకి కారణం.. షేక్ హసీనా బహిష్కరణ తర్వాత తమపై జరుగుతున్న దురాగతాలే. కనుచూపు జనంతో లక్షలాదిగా తరలి వచ్చిన వైనం.. ఆ దేశంలో మైనార్టీలపై సాగే దురాగతాలకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో మైనార్టీలైన హిందువులు నిర్వహించిన అతి పెద్ద నిరసన కార్యక్రమాల్లో ఇది పెద్దదిగా చెబుతున్నారు.
గత ఆగస్టు ఐదున షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత మైనారిటీలపై భౌతికదాడులు, లూటీలు, విధ్వంసకాండలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మైనార్టీ హక్కులకు భంగం కలగనీయమని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయినప్పటికీ.. దాడుల ఘటనలు అదేపనిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాలోని హిందువులు సంఘటితంగా భారీ ప్రదర్శకు దిగటం ఇదే తొలిసారి. తాజాగా జరుపుతున్న నిరసనల వేళ.. వారు ఎనిమిది డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చారు. తమ డిమాండ్ల విషయంలో తాత్కాలిక ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. మహ్మద్ యూనస్ సారథ్యంలోని ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూస్తున్న హిందూసంఘాలు.. ఈసారి తాము తగ్గేదేలేదని స్పష్టం చేస్తున్నారు.
హిందూ సంఘాల 8డిమాండ్లు ఇవే..
- మైనారిటీలపై దాడులతో ప్రమేయం ఉన్న వారిపై చర్యలను వేగవంతం చేసేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు
- దాడుల బాధితులకు పరిహారం, పునరావసం కల్పించడం.
- తక్షణం మైనారిటీల పరిరక్షణ చట్టం తీసుకురావడం.
- మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు.
- విద్యా సంస్థలు, హాస్టళ్లలో మైనారిటీలు ప్రార్థనలు చేసుకునేలా ఆరాధనా స్థలాలు, ప్రేయర్ రూమ్‌ల ఏర్పాటు
- హిందూ బుద్ధిస్ట్, క్రిస్టియన్ వెల్ఫేర్ ట్రస్టులకు చేయూత
- ప్రాపర్టీ రికవరీ అండ్ ప్రిజర్వేషన్ యాక్ట్, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎన్‌ట్రస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్‌ను సక్రమంగా అమలు చేయడం.
- సంస్కృతి, పాలి ఎడ్యుకేషన్ బోర్డును ఆధునీకరించడం, దుర్గాపూజకు 5 రోజుల సెలవుదినాలు ప్రకటించడం.
బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువులు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న వేళ.. దేశ పర్యావరణ శాఖా మంత్రి సైయద్ రిజ్వూన హసన్ స్పందించారు. హిందూ సమాజం డిమాండ్లను తాము తెలుసుకున్నామని.. వారికి హామీగా దుర్గాపూజకు రెండు రోజులు సెలవులు ప్రకటించామన్నారు. బంగ్లాదేశ్ చరిత్రలో రెండ్రోజులు సెలవు ప్రకటించటం ఇదే తొలిసారిగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు తమ దేశంలో జరుగుతున్న హిందువుల నిరసన ర్యాలీని వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తన ఎక్స్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. ఇదిలా ఉండగా..బంగ్లా హిందువులు అక్కడి నుంచి పారిపోకూడదని ఆర్ ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్రాత్రేయ హోసబలే వ్యాఖ్యానించారు. వారిరక్షణకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. అంతేకాదు బంగ్లాదేశ్ హిందువుల భద్రతకు ఐక్యరాజ్యసమితి హామీ ఇవ్వాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.