Begin typing your search above and press return to search.

"బాబా గురువే కానీ దేవుడు కాదు"... ఆలయాల్లో విగ్రహాలు తొలగింపు!

ప్రస్తుతం "సనాతన ధర్మం" అనే విషయం తీవ్ర హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Oct 2024 1:30 PM GMT
బాబా గురువే కానీ దేవుడు కాదు... ఆలయాల్లో విగ్రహాలు తొలగింపు!
X

ప్రస్తుతం "సనాతన ధర్మం" అనే విషయం తీవ్ర హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అసలు సిసలు సనాతన ధర్మం అంటే ఇది అని పలువురు పండితులు ఒకరకంగా చెబుతుంటే.. తమకు తెలిసిన ధర్మం ఇదే అంటూ పలువురు నాయకులు తమదైన జ్ఞానంతో సరికొత్త సమస్యలు తీసుకొస్తున్నారు!

ఈ సమయంలో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సాయిబాబాకు తగిలిందని తెలుస్తోంది. తాజాగా "సనాతన్ రక్షక్ దళ్" అనే బృందం ప్రారంభించిన ప్రచారంతో వారణాసిలోని పలు దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించారు. సాయిబాబా గురువే కానీ దేవుడు కాదని.. అవగాహన లేకుండా బాబాను పూజిస్తున్నారని అంటున్నారు.

అవును... ఇప్పుడు వారణాసిలోని ఆలయాల్లో ఉన్న సాయిబాబా విగ్రహాలను తీసి బయట పెడుతున్నారు. వీటిలో బడా గణేష్ ఆలయంలో ఉన్న సాయిబాబా విగ్రహాన్ని 'సనాతన్ రక్షక్ దళ్' బృందం తొలగించి.. ఆలయం ప్రాంగణం వెలుపల ఉంచింది. ఈ సందర్భంగా స్పందించిన ఆలయ ప్రధాన పూజారి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... సరైన అవగాహన లేకుండా సాయిబాబాను పూజిస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో అన్నపూర్ణ ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ.. గ్రంథాలలో సాయిబాబా పూజల ప్రస్థావనే లేదని.. ఇది శాస్త్రాలలో నిషిద్దమని అన్నారు. ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదని అన్నారు.

ఇదే క్రమంలో... అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ మహంత్ రాజ్ దాస్ మాట్లాడుతూ... సాయి ధర్మ గురువు, మహా పురుషుడు కావొచ్చు కానీ.. భగవాన్ మాత్రం కాలేడు.. అతని విగ్రహాన్ని తొలగించిన వారణాసికి తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇక సనాతన్ రక్షక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ శర్మ మాట్లాడుతూ.. కాశీలో పరమశివుని పూజలు మాత్రమే జరగాలని అన్నారు. ఈ సమయంలో.. పరమేశ్వరుడి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఇప్పటికే 10 ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను తొలగించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరికొన్ని విగ్రహాలను తొలగిస్తామని అన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన పలువురు బాబా భక్తులు ఈ విషయంపై విచారం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఘటన కోట్లాది మంది సాయి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని.. దేవుళ్లందరూ ఒక్కటే అని.. దేవుణ్ణి ఏ రూపంలో నమ్మినా, పూజించుకునే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో... సాయిబాబా హిందువా, ముస్లిమా, అనే విభజనను సృష్టించింది మనషే అని.. దేవుడు మనుషుల మధ్య భేదాలు పెట్టడు కానీ, మనుషులు మాత్రం దేవుళ్ల మధ్య భేధాలు పెడుతున్నారని మరికొంతమంది సాయి భక్తులు వాపోతున్నారు!

ఈ పరిణామాలపై స్పందించిన యూపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ హింద్వీ... బీజేపీ, దానికి మద్దతు ఇచ్చేవారు మతాన్ని రాజకీయాల కుస్తీ వేదికగా మార్చడం దురదృష్టకరమని అన్నారు. ఇదే సమయంలో... దేవుళ్లపై విశ్వాసాన్ని అడ్డుపెట్టుకుని ఆడుకునే విషయంలో బీజేపీ నెంబర్ 1 ప్లేయర్ అని అనిపిస్తోందని ఎప్సీ అధికార ప్రతినిధి సునీల్ సింగ్ అభిప్రాయపడ్డారు.