గ్రామసభలు తీర్మాణం... కులం పేరుతో ఉన్న వీధుల పేర్లు తొలగిస్తున్నారు!
తమిళనాడులో ప్రస్తుతం సనాతన ధర్మంపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 13 Oct 2023 4:20 AM GMTకులం... లౌకికవాద దేశంగా ప్రపంచం ముందు గొప్పగా చెప్పుకునే భారతదేశాన్ని ఇప్పటీకీ పట్టిపీడిస్తున్న వ్యాది! ఇది దీర్ఘకాలిక వ్యాది అని కొంతమంది చెప్పుకుంటున్నా.. దానికీ సరైన ట్రీట్ మెంట్ ఉందని, మనిషి మనిషిలా ఆలోచిస్తే అదే మెడిసిన్ అని, అది రెగ్యులర్ గా వాడితే సరిపోతుందని మరికొంతమంది చెబుతుంటారు. ఈ క్రమంలో దక్షిణ తమిళనాడులోని ఒక జిల్లా ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై అభినందనలు వెళ్లివెత్తుతున్నాయి.
తమిళనాడులో ప్రస్తుతం సనాతన ధర్మంపై తీవ్ర చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. మనుషుల మధ్య గోడలు కట్టే ఆ నీచ సంస్కృతి వల్ల ప్రయోజనం లేదనే స్థాయిలో అక్కడ కొంతమంది తమ వాదన వినిపిస్తున్నారు. అయితే ఇదేదో ఇప్పుడు కొత్తగా ఉదయనిధి స్టాలిన్ లేవనెత్తిన అంశం కాదని, ఆయనపై విరుచుకుపడాల్సిన పనిలేదని, పెరియార్ లాంటి మహానుభావులు ఎప్పుడో చెప్పారని, కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్ధరాజకీయాల కోసం ఆ అంశాన్ని అణిచివేస్తున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఈ సమయంలో దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో మాత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ సరికొత్త ఒరవడికి తెరలేపింది. ఇందులో భాంగంగా వీలైనంత వరకూ కుల ప్రస్థావన లేని వీధులను, ఊర్లను తెరపైకి తేవాలని ఫిక్సయ్యింది. దీంతో కులం పేరుతో వీధుల పేర్లు లేని జిల్లాగా త్వరలో తూత్తుకుడి ఆవిర్భవించనుంది. ప్రస్తుతం తమిళనాడులో ఇది అత్యంత చర్చనీయాంశం అయ్యింది.
అవును... దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఇకపై కులం పేరుతో వీధుల పేర్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు! తిరునెల్వేలి జిల్లా నాంగునేరిలో ఆగస్టులో కుల వివక్ష కారణంగా పాఠశాల విద్యార్థి, అతని సోదరిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో పాఠశాల వయసులోనే ఇలా పసిమనసుల్లో కుల జాడ్యం నాటుకుపోతుందని భావించిన తమిళనాడు సర్కార్... సామాజిక సామరస్యాన్ని పెంచేందుకు పలు చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా... తూత్తుకుడి జిల్లాలో బహిరంగ ప్రాంతాల్లోని కుల సంబంధిత గుర్తులను ప్రజల సాయంతో తొలగించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో... మొదటిగా జిల్లాలోని 33 పంచాయతీల్లో కులం పేరుతో ఉన్న 80 వీధుల పేర్లను మార్చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దీంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రజలు కొన్ని చోట్ల గుర్తులను తొలగిస్తున్నారు.
ఇదే సమయలో... గ్రామసభలలోనూ ఈ మేరకు తీర్మానాలు చేస్తున్నారు. కులం పేరుతో ఉన్న వీధిపేర్లు తీసేసి.. అక్కడ స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెడుతున్నారు. ఈ మేరకు జిల్లాలో పలు గ్రామాల్లో వీధుల పేర్లు కులం గుర్తుతో ఉన్నాయని, వాటిని తొలగించి స్వాతంత్య్ర సమరయోధులు, తమిళ సాహితీవేత్తలు, శాస్త్రవేత్తలు తదితరుల పేర్లను పెట్టాలని గ్రామ పంచాయతీలను అభ్యర్థించినట్లు కలెక్టరు తెలిపారు.
దీంతో... ఇది కులవివక్ష పోవడానికి, కులరహిత సమాజం ఏర్పడి, సమ సమాజం గోదావరిలా ప్రవహించడానికి ఈ జిల్లా నాసికా త్రయంబకం లాంటిదని అంటున్నారు కులరహిత సమాజం కోరుకునే "మనుషులు"!