జగన్ పై మహిళా మంత్రి నిప్పులు.. గ్యాప్ లో సెటైర్లు!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గురువారం మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 Feb 2025 12:40 PMఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గురువారం మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ మరీ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ మంత్రి సంధ్యారాణి.. ఇటీవల కాలంలో జగన్ పై ఎవరూ వేయని స్థాయిలో అన్నట్లుగా సెటైర్లు వేస్తూ నిప్పులు కురిపించారు.
అవును... మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క నిప్పుల వర్షం కురిపిస్తూ.. గ్యాప్ లో సెటైర్లు వేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... పిచ్చి జగన్, సైకో జగన్ గా మారటమే "జగన్ 2.ఓ" అని మొదలుపెట్టి.. శవం లేస్తే కాని బయటకు రాని దుర్మారుడు అంటూ ధ్వజమెత్తారు!
విజయమ్మ, షర్మిల ఆయుస్షు గట్టిది కాబట్టే జగన్ కు దూరంగా ఉంటున్నారని అన్నారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఈ సారి 11 సీట్లు రావు సరికదా ప్రజలు చొక్కా పట్టుకుని రాష్ట్రం బయటకూ గెంటుతారు అని అన్నారు! ఇక ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను ముట్టడించడం ఒక్కటే మిగిలి ఉందని.. అందువల్ల జగన్ ఆ పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.
ఇక ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని.. ఆయన లండన్ నుంచి మందులు తెచ్చుకుంటారని.. ఇప్పుడు అవి పనిచేయట్లేదని.. జగన్ పరిస్థితి చూస్తుంటేనే ఆ విషయం అర్ధమవుతోందని చెప్పిన మంత్రి సంధ్యారాణి.. జగన్ సరైన మానసిక వైద్యం చేయించుకోవడానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సిఫార్సు చేస్తానని అన్నారు. అప్పుడైనా ఓ మంచి డాక్టర్ కి చూపించుకోవాలని సూచించారు!
ఇదే సమయలో గత ఐదేళ్లూ నిత్యం బూతులు మాట్లాడిన జగన్.. ఇప్పుడు మాత్రం నీతులు చెబుతున్నారని.. అయితే, ఆ నీతులను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇక విశ్వసనీయత అనే పదానికి జగన్ కు అర్ధం తెలియదని.. తండ్రి చనిపోతే ఆయన శవం ముందే సీఎం పదవి గురించి మాట్లాడుకొవడమేనా విశ్వసనీయత.. తల్లిని చెల్లిని బయటకు పంపించేసి.. చెల్లి ఆస్తిపై కన్నేయడమేనా విశ్వసనీయతన అంటూ ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో ఏప్రిల్, మే నెలల్లో రూ.20 వేల కోట్లు అప్పు చేశారని.. వెంటనే ఎన్నికలు వచ్చాయని చెప్పిన మంత్రి సంధ్యారాణి.. ఆ డబ్బుతో ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆ డబ్బును తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వెసుకోవడానికి ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఈ విధంగా జగన్ పై విరుచుకుపడ్డారు మంత్రి సంధ్యారాణి!