Begin typing your search above and press return to search.

నెల తర్వాత అమ్మ వస్తది.. కన్నీళ్లు తెప్పిస్తున్న మాట

గుండెల్ని పిండేసే కొన్ని సందర్భాల్లో ఏమీ తెలియని వయసు వరంగా మారుతుంటుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 5:13 AM GMT
నెల తర్వాత అమ్మ వస్తది.. కన్నీళ్లు తెప్పిస్తున్న మాట
X

గుండెల్ని పిండేసే కొన్ని సందర్భాల్లో ఏమీ తెలియని వయసు వరంగా మారుతుంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే నాలుగేళ్ల శాన్విది కూడా. తమ ఇంటి అభిమాన హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప2 బెనిఫిట్ షోను చూసేందుకు సంధ్య థియేటర్ కు వెళ్లి.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి.. తీవ్ర గాయాలతో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీతేజ్ గురించి తెలిసిందే. మరి.. చిన్నారి శాన్విక మాటేమిటి? తొక్కిసలాట జరిగినప్పుడు తండ్రితో దూరంగా ఉన్న కారణంగా ఆమెకు ఏమీ కాలేదు.

సినిమాకు వెళ్లిన వారి కుటుంబం సినిమా చూడకుండా ఎందుకు వచ్చేశామన్న విషయం మీద ఆమెకు కొంత కన్ఫ్యూజ్ ఉన్నప్పటికీ.. తన తల్లి ఊరికి వెళ్లిందని.. నెల తర్వాత తిరిగి వస్తుందన్న గంపెడు ఆశతో అమ్మమ్మ ఇంట్లో ఉంది. తన తండ్రితో కలిసి ఆసుపత్రికి వెళ్లి.. సోదరుడు కోసం వెళుతున్నప్పటికీ ఆ గాయాల తీవ్రత ఆమెకు తెలీదు. తొక్కిసలాట కారణంగా తమ కుటుంబం ఛిన్నాభిన్నమైన విషయం శాన్వికకు తెలీదు. తన సోదరుడు ప్రాణాపాయ స్థితిలో ఇంకా కొట్టుమిట్టాడుతున్న విషయం కూడా ఆమెకు తెలీదు.

తనను అడిగే వారితో ఆమె చెప్పే మాటలు విన్నంతనే గుండె మెలి తిప్పినట్లుగా.. కంట వెంట కన్నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. సినిమాకు వెళ్లిన తాము థియేటర్ లోకి వెళ్లామని.. అల్లు అర్జున్ వచ్చాడని తెలియటంతో థియేటర్ బయటకు వచ్చామని.. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలీదని చెబుతోంది. అంతేకాదు.. తన తల్లి ఊరికి వెళ్లిందని.. నెల తర్వాతే తిరిగి వస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పే మాటలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అసలేం జరిగిందో తెలీని శాన్విక మాత్రం రోజూ బడికి.. ట్యూషన్ కు వెళ్లివస్తోంది. ఆమె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. కొండంత విషాదాన్ని గుండెల్లో పెట్టుకొని రోజుల్ని భారంగా వెళ్లదీస్తున్న వారి కుటుంబాన్ని చూస్తే.. అయ్యో అనుకోని వారెవరూ ఉండరు.