ఆమె మరణంతో మాకేం సంబంధం లేదు: సంధ్య థియేటర్ ఓనర్లు
సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు తమ పెట్టిన కేసును కొట్టేయాలని థియేటర్ యజమానులు హైకోర్టును కోరారు.
By: Tupaki Desk | 11 Dec 2024 10:00 AM GMTబ్లాక్ బస్టర్ హిట్ పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో టైమ్ లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూడడానికి అల్లు అర్జున్ రావడంతో భారీ సంఖ్యలో అంతా ఎగబడ్డారు. దీంతో ఆ సమయంలో తొక్కిసలాట జరగ్గా.. రేవతి అనే మహిళ మృతి చెందింది.
ఈ ఘటనపై రేవతి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంధ్య థియేటర్ ఓనర్స్ సహా పలువురిపై కేసులు పెట్టిన చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పుడు తమ పెట్టిన కేసును కొట్టేయాలని థియేటర్ యజమానులు హైకోర్టును కోరారు.
సంధ్య థియేటర్ తమదే అయినా.. ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని యజమానులు పిటిషన్ లో తెలిపారు. 5వ తేదీన రాత్రి వేసిన ప్రీమియర్ షో బాధ్యతలను డిస్ట్రిబ్యూటర్లు చేపట్టారని చెప్పారు. ఆ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు కూడా జారీ చేసిన విషయాన్ని థియేటర్ యజమానులు ప్రస్తావించారు.
అయితే తమకు ప్రీమియర్ షోతో సంబంధం లేకపోయినా.. బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని పోలీసులకు కోరినట్లు తెలిపారు. ప్రజలను అదుపు చేయాలని ముందే వినతి పత్రం అందించామని చెప్పారు. దీంతో కొందరు పోలీసులు బందోబస్తు కల్పించడానికి వచ్చారని పేర్కొన్నారు. కానీ భారీగా అభిమానులు తరలివచ్చారని చెప్పారు.
అందుకే తోపులాట అయిందని, దీంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కానీ తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేవని, అందుకే కేసును కొట్టేయాలని థియేటర్ యజమానులు కొట్టేయాలని కోరారు.
కాగా, ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఘటనపై కొద్ది రోజుల క్రితం స్పందించిన అల్లు అర్జున్.. మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.25 లక్షల సాయం ప్రకటించారు. తాను రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని బన్నీ హామీ ఇచ్చారు.