Begin typing your search above and press return to search.

రీల్ కు రియల్ కు ఇంత తేడా ఉంటుందా పుష్పా?

పుష్ప 2 మూవీలో ఒక సీన్ ఉంటుంది. రాత్రికి పెళ్లి పెట్టుకొన్న ఒకడు.. పొద్దున్నే ఎర్రచందనం చెట్లు కొట్టేందుకు అడవిలోకి పుష్ప సభ్యుడిగా పనికి వెళతాడు

By:  Tupaki Desk   |   7 Dec 2024 4:15 AM GMT
రీల్ కు రియల్ కు ఇంత తేడా ఉంటుందా పుష్పా?
X

పుష్ప 2 మూవీలో ఒక సీన్ ఉంటుంది. రాత్రికి పెళ్లి పెట్టుకొన్న ఒకడు.. పొద్దున్నే ఎర్రచందనం చెట్లు కొట్టేందుకు అడవిలోకి పుష్ప సభ్యుడిగా పనికి వెళతాడు. అనుకోకుండా పోలీసులు చుట్టు ముట్టి.. వారందరిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకెళతాడు. మరోవైపు.. పెళ్లి పీటల మీద పెళ్లి కుమార్తె వెయిట్ చేస్తూ ఉంటుంది.పెళ్లి కుమార్తె తండ్రి కోపంతో ఉంటాడు. పెళ్లి పెట్టుకొని ఇలా ఎవడైనా వెళతాడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే.. పీటల మీద కూర్చున్న పెళ్లి కుమార్తె కలుగుజేసుకుంటుంది. నేనే చెప్పా.. పుష్ప పనికి వెళ్లి రమ్మని. నాకు నమ్మకం ఉంది పెళ్లి ముహుర్తం టైంకు వచ్చేస్తాడు.. అక్కడ పుష్ప ఉన్నాడంటూ ఆ క్యారెక్టర్ చెప్పటం కనిపిస్తుంది.

అన్నట్లే.. పెళ్లి పెట్టుకొన్న ఒకడు.. తన పని కోసం అడవికి వెళ్లి.. పోలీసులకు దొరికిపోయాడన్న విషయం తెలుసుకున్న పుష్ప.. అలియాస్ పుష్పరాజ్ నేరుగా స్టేషన్ కు వెళతాడు. పెళ్లి కొడుకును ఇంటికి పంపేందుకు అక్కడి పోలీసులు సహకరించకపోతే.. వారికి వచ్చే జీతం.. వారికి ఉన్నసర్వీసు.. ఆ లెక్కన వచ్చే జీతంతో పాటు.. పెన్షన్ బెనిఫిట్స్ లెక్కేసి.. అక్కడికక్కడే స్టేషన్ లో ఉన్నందరికి డబ్బులు లెక్క సెటిల్ చేస్తాడు. అందరూ రాజీనామా చేసేసి వెళ్లిపోతారు. కట్ చేస్తే.. లాకప్ లో ఉన్న వారంతా బయటకు వచ్చేస్తారు.

ఇక్కడ చెప్పాలనుకుంటున్నదేమంటే.. తన మనిషి అనేటోడికి ఏం జరిగినా.. పుష్ప అక్కడికి వచ్చేస్తాడు.వారి కష్టం తెలుసుకుంటాడు. ఎంత ఖర్చు అయినా.. ఏం జరిగినా.. ఏ స్థాయి వారు అడ్డుకున్నా.. వారికి ఎదురెళ్లి.. ఢీ కొట్టి మరీ తన వాళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూస్తాడు రీల్ పుష్ప రాజ్. కట్ చేస్తే.. వెండితెర మీద పుష్ప పాత్రను అత్యద్భుతంగా పండించిన అల్లు అర్జున్.. రియల్ లైఫ్ లో వ్యవహరించిన తీరుపైనే వేలెత్తి చూపటం ఎక్కువైంది. దీనికి కారణం..ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోను ప్రేక్షకులతో కలిసి చూసేందుకు అల్లు అర్జున్ రావటం.. ఆ సందర్భంగా జరిగిన తీవ్ర తొక్కిసలాటతో రేవతి అనే ఇద్దరు చిన్నారుల తల్లి.. ఆమె పెద్ద కొడుకు గాయపడ్డారు. వారిలో రేవతి ఆ రాత్రే చనిపోగా.. బాలుడు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పుష్ప 2 సినిమాలో.. తన వాళ్లకు ఏమైనా అయితే.. ప్రాణాల్ని పణంగా పెట్టే పుష్పరాజ్.. రియల్ లైఫ్ లో అనూహ్య విషాద ఘటన చోటు చేసుకుంటే.. స్పందించేందుకు దగ్గర దగ్గర 48 గంటల టైం తీసుకోవటం ఏమిటి? అంతేకాదు.. తనకు రేవతి చనిపోయారన్న విషయం పక్క రోజు ఉదయం తెలిసిందని అల్లుఅర్జున్ నోటి నుంచి విన్నంతనే షాక్ కు గురవుతాం. రీల్ లో తన వాళ్ల కోసం డబ్బులు కుమ్మరించి.. స్టేషన్ మొత్తాన్ని కొనేసే అతడికి తగ్గట్లు.. ఆ పాత్రలో జీవించిన అల్లు అర్జున్.. మరెంతలా రియాక్టు కావాలి? అన్నదే ప్రశ్న. రీల్ కు రియల్ కు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపించటమే కాదు.. తన వాళ్ల విషయంలో రీల్ పుష్ప రియాక్టు అయ్యే తీరుకు.. ఆ పాత్రను పోషించే అల్లు అర్జున్ రియాక్టు అయిన తీరును చూసినప్పుడు మాత్రం.. అదేంది? రీల్ కు రియల్ కు మధ్య తేడా ఇంతలా ఉంటుందా పుష్పా? అన్న ప్రశ్న మాత్రం రాక మానదు.