Begin typing your search above and press return to search.

సంధ్య ఆక్వాకు వచ్చిన ఆ విదేశీయుడు ఎవరు?

ఎన్నికల వేళ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ మొయిన్ రోడ్ వద్ద జరిపిన వాహనాల తనిఖీ వేళ

By:  Tupaki Desk   |   26 March 2024 3:58 AM GMT
సంధ్య ఆక్వాకు వచ్చిన ఆ విదేశీయుడు ఎవరు?
X

ఎన్నికల వేళ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ మొయిన్ రోడ్ వద్ద జరిపిన వాహనాల తనిఖీ వేళ.. ఒక విదేశీయుడి వద్ద రూ.1.3 లక్షల మొత్తం కనిపించటంతో వెంటనే అతన్ని ప్రశ్నించారు. స్థానిక పోలీసులు ఏం చెబుతున్నారో అర్థం కాని సదరు విదేశీయుడు తన ఫోన్ తో ఒకరికి కాల్ కలపటం.. అవతల వ్యక్తితో మాట్లాడినంతనే పోలీసులు అలెర్టు అయిపోయి.. మరింత హడావుడి చేయటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ ఆ విదేశీయుడు ఎవరు? అతను కాల్ చేసిన అవతలి వ్యక్తి ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే..

విశాఖ డ్రగ్స్ రాకెట్ దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని రేపిందో తెలిసిందే. విశాఖ పోర్టుకు వేలాది కేజీల ప్రాసెస్డ్ ఈస్ట్ రావటం.. అందులో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించటం.. ఈ రాకెట్ వెనుక భారీ నెట్ వర్కు ఉందన్న అనుమానాలు వ్యక్తం కావటం తెలిసిందే. ఎన్నికల వేళ వెలుగు చూసిన ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో సంధ్య ఆక్వా పరిశ్రమ పేరు మారుమోగింది.ఇంటర్ పోల్ ఇచ్చిన సమాచారంతో సీబీఐ జరిగిన తనిఖీల్లో ఈ రాకెట్ బయటకు రావటం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా కాకినాడ జిల్లాలోని ఉప్పాడ మొయిన్ రోడ్ లో వెళుతున్న కారును తనిఖీ చేశారు. అందులోని విదేశీయుడి వద్ద రూ.1.30 లక్షల మొత్తం కనిపించింది. ఎన్నికల వేళ రూ.50వేలకు మించిన నగదును తీసుకెళ్లటంపై పరిమితులు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ విదేశీయుడ్ని పోలీసులు ప్రశ్నించారు. పోలీసులు అడుగుతున్న విషయాల్ని అర్థం చేసుకోలేని సదరు విదేశీయుడు తన ఫోన్ లో కాల్ చేశారు. ఫోన్ లో అవతల వ్యక్తి సంధ్య అక్వా పరిశ్రమకు చెందిన వ్యక్తి కావటంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు.

అయితే.. సదరు విదేశీయుడు వియత్నాం దేశానికి చెందిన వ్యక్తి అని.. అతని పేరు టాంగ్ అని.. సంధ్య ఆక్వా పరిశ్రమలోని యంత్రాలకు సంబంధించిన రిపేర్ల కోసం వస్తుంటారని పేర్కొన్నారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో పట్టుబడిన విదేశీయుడి కోసం సంధ్య ఆక్వా ప్రతినిధులు ఫ్లయింగ్ స్క్వాడ్ వద్దకు వచ్చి.. అతడి వివరాల్ని వెల్లడించారు. వారు చెప్పిన వివరాలు సరిపోవటంతో అతడి నుంచి హామీ పత్రాన్ని తీసుకొని వదిలిపెట్టారు. సంధ్య ఆక్వా పేరు విన్నంతనే పోలీసులు అలెర్టు అయిన వైనం ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.