శాండ్ విచ్ జనరేషన్ కష్టాలు మామూలుగా లేవుగా?
సంపాదన ఉన్నప్పటికి సంతోషంగా లేని జీవితం ఒకటి ఉంటుందా? అంటే.. శాండ్ విచ్ జనరేషన్ జనాల్ని చూపిస్తే అవును అనకుండా ఉండలేరు.
By: Tupaki Desk | 25 Feb 2025 10:30 AM GMTసంపాదన ఉన్నప్పటికి సంతోషంగా లేని జీవితం ఒకటి ఉంటుందా? అంటే.. శాండ్ విచ్ జనరేషన్ జనాల్ని చూపిస్తే అవును అనకుండా ఉండలేరు. నిత్యం కష్టపడుతూ.. తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ఈ బ్యాచ్ వారి ఇబ్బందుల్ని.. వారికి ఎదురయ్యే కష్టాల్ని చూస్తే.. అయ్యో పాపం అనాల్సిందే. సినిమాటిక్ గా ఉండే వీరి కష్టాల గురించి తాజా ఒక సర్వే రిపోర్టు వెల్లడించింది. ఇంతకూ శాండ్ విచ్ జనరేషన్ అని ఎవరిని అంటారు? అన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం.
35-54 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని శాండ్ విచ్ జనరేషన్ గా అభివర్ణిస్తున్నారు. వీరి పరిస్థితి శాండ్ విచ్ మాదిరే ఉంటుంది మరి. ఓవైపు పిల్లల ఫ్యూచర్ కోసం పొదుపు చేయాలి. మరోవైపు వారి చదువుల కోసం ఖర్చు చేయాలి. ఇంకోవైపు జీవిత భాగస్వాముల ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితో పాటు తల్లిదండ్రులకు వైద్యం.. వారి జీవనానికి అవసరమైన ఖర్చుల్ని చూసుకోవాలి. ఇన్ని ఒత్తిళ్ల మధ్య వారి జీవితం సాగుతూ ఉంటుంది.
మన దేశంలో ఈ తరానికి సంబంధించిన నాలుగు వేల మందితో ఒక బీమా సంస్థతో పాటు మరో సంస్థ కలిసి సర్వే చేశాయి. సర్వే రిపోర్టు ప్రకారం 60 శాతం మంది భవిష్యత్తు ఆర్థిక భద్రత గురించి భయపడుతున్న విషయాన్ని వెల్లడించారు. ఎంత ఆదా చేసినా.. ఎంత పెట్టుబడి పెట్టినా భవిష్యత్ అవసరాల కోసం సరిపోదున్న ఆందోళనలో వారున్నట్లుగా రిపోర్టు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న 50 శాతం మందిలో తమ వద్ద ఉన్న డబ్బులు ఎప్పుడైనా అయిపోవచ్చన్న భయాందోళనలో ఉన్నట్లుగా వెల్లడించారు.
ఈ జనరేషన్ వారు ఎక్కువగా అప్పులు తీసుకోవటం.. క్రెడిట్ కార్డుల్ని వినియోగించటం..ఖర్చులను తట్టుకోవటం కోసం గతంలో పెట్టిన పెట్టుబడులను ముందే వెనక్కి తీసుకోవటం లాంటివి చేస్తున్నట్లుగా గుర్తించారు. పిల్లల చదువులు.. వారి కెరీర్ అవసరాలు తీర్చటం.. తల్లిదండ్రులు ఆరోగ్య ఖర్చులు.. వ్యక్తిగత జీవితంలో సమతుల్యత కోసం వారి తిప్పలు అన్ని ఇన్ని కావన్న విషయాన్ని వెల్లడించారు. ఇంతా చేస్తే.. వీరి ఆదాయాలు మరీ తక్కువగా ఉంటాయా? అంటే ఉండవనే చెప్పాలి. సర్వే ప్రకారం ఈ జనరేషన్ వారి ఆదాయాలు రూ.లక్ష నుంచి రూ.2.5లక్షల వరకు ఉంటుందని తేలింది. ఇంత సంపాదిస్తున్నా.. అవసరానికి తగినంత సంపాదిస్తున్న సంతోషం వీరిలో ఉండదని గుర్తించారు. అంతేకాదు.. ఏదైనా కొంటే అనవసరంగా డబ్బుల్ని వేస్టు చేస్తున్నామన్న భావనలో వీరు ఉంటారని రిపోర్టు వెల్లడించింది. ఈ ఆందోళన వారిలో మనీ డిస్మార్ఫియా భావనకు గురి చేస్తుందని పేర్కొన్నారు.ఇలాంటివి మీలోనూ.. మీకు తెలిసిన వారికి ఉంటే.. వారు చేయాల్సింది సరైన ఆర్థిక ప్రణాళికను వేసుకోవటం.. ఆర్థిక సలహాదారుల సూచనల్ని పాటిస్తే ఈ ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ అయ్యే వీలుందని చెబుతున్నారు.