Begin typing your search above and press return to search.

హస్తినలో సంఘ్ పరివార్ వ్యూహాలు.. ఆప్ అడ్రస్ గల్లంతేనా?

ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే.. దాదాపు 12 ఏళ్లుగా ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేయాలని చూస్తోంది

By:  Tupaki Desk   |   23 Jan 2025 2:30 AM GMT
హస్తినలో సంఘ్ పరివార్ వ్యూహాలు.. ఆప్ అడ్రస్ గల్లంతేనా?
X

ఇప్పుడు అందరి దృష్టి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనే.. దాదాపు 12 ఏళ్లుగా ఢిల్లీని పాలిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి తన ఎన్నికల గుర్తు చీపురుతో ఊడ్చేయాలని చూస్తోంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న కమలనాథులు ఢిల్లీ కోటను దక్కించుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు. 25 ఏళ్ల తర్వాత కమలం వికసించేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తమ మాతృ సంస్థ సంఘ్ పరివార్ ను రంగంలోకి దింపిందని చెబుతున్నారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో తనదైన వ్యూహాలతో బీజేపీకి విజయాన్ని అందించిన సంఘ్ ఢిల్లీలో కాలు మోపడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

సంఘ్ పరివార్ అంటేనే బీజేపీ.. తెర ముందు బీజేపీ కనిపించినా, తెరవెనుక సంఘ్ పరివార్ కష్టమే కాషాయ జైత్రయాత్రకు ప్రధాన కారణమనే విశ్లేషణలు ఉన్నాయి. ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఊహించిన దెబ్బ తగలడంతో సంఘ్ పరివార్ పూర్తిగా అలర్ట్ అయింది. 400 సీట్లు వస్తాయని ధీమాతో ఆ ఎన్నికల్లో సంఘ్ ఏమరపాటుగా వ్యవహరించడం వల్ల తీవ్రంగా నష్టపోవాల్సివచ్చిందని అంటున్నారు. దీంతో మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల్లో పూర్తి ఫోకస్ పెట్టారు సంఘ్ పెద్దలు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంలో విఫలమైంది. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే రంగంలోకి దిగిన సంఘ్ పరివార్ ఆ రెండు రాష్ట్రాల్లో ఓ పథకం ప్రకారం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫలితాలను సమూలంగా మార్చేసింది. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు దిమ్మదిరిగేలా షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఢిల్లీపైనా అవే వ్యూహాలను అమలు చేసే దిశగా సంఘ్ పనిచేస్తోందని చెబుతున్నారు.

ఢిల్లీలో బీజేపీ అధికారం ముగిసి దాదాపు పాతికేళ్లు అవుతోంది. దేశవ్యాప్తంగా విజయాలు సాధిస్తున్నా, ఢిల్లీ అసెంబ్లీ మాత్రం కాషాయానికి చిక్కడం లేదు. ఇదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో అన్నిసీట్లు గెలుచుకుంటూ వస్తోంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీపై ఎలాంటి వ్యూహం అనుసరించాలో కమలం పెద్దలు తేల్చుకోలేకపోతున్నారు. దీంతో తమ మాతృ సంస్థ సంఘ్ పరివార్ ను హస్తినలో మోహరించారంటున్నారు. దీంతొ కేరాఫ్ నాగపూర్ గా ఉన్న సంఘ్‌ పరివార్ మొత్తం ఢిల్లీలో వాలిపోయింది. RSSతో పాటు సంఘ్ కింద ఉన్న అన్ని సంఘాల కార్యకర్తలు, నేతలు తమ మకాంను హస్తినకు మార్చారు. ప్రతి గల్లీ గల్లీని చుట్టేస్తూ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఉన్న పరిస్థితులపై వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీకి ఎక్కడ పట్టుంది..ఎక్కడ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్నాయనే దానిపై నివేదికలిస్తూ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది.

చివరిసారిగా దివంగత నేత సుష్మా స్వరాజ్‌ ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో ఢిల్లీలో అధికారం కోల్పోయింది బీజేపీ. ఆ తర్వాత కాంగ్రెస్, ఆప్ పార్టీలే వరుసగా గెలుస్తూ వస్తున్నాయి. వరుసగా ఆరుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. అందులో భాగంగా సాఫ్రాన్‌ (కాషాయ) ఆర్మీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంఘ్ పరివార్‌..బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపుతోంది. హస్తిన మారుమూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ కనీసం 50 వేల సమావేశాలు పెట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే సంఘ్‌ శ్రేణులు ఢిల్లీలో దిగిపోయాయి. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో 13 వేల వరకు ఎన్నికల బూత్‌లు ఉన్నాయి. ప్రతి బూత్‌ స్థాయిలో సంఘ్‌ పరివార్‌ కార్యకర్తలు చిన్న చిన్న గల్లీ మీటింగ్స్‌ పెడుతున్నారు. ఆమ్‌ అద్మీ పార్టీ ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, వాటర్‌, కరెంట్‌ సమస్యలు, బంగ్లాదేశ్‌ చొరబాటుదారులకు రేషన్‌ కార్డులు ఇచ్చిన అంశాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు సంఘ్‌ కార్యకర్తలు.

బీజేపీపై అసంతృప్తితో లోక్‌సభ ఎన్నికలకు సంఘ్‌ పరివార్‌ దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అందుకేలో లోక్ సభ ఎన్నికలప్పుడు మహాయుతి ఘోరంగా దెబ్బతిందన్న అంచనాలున్నాయి. ఆ తర్వాత అత్యున్నత స్థాయిలో చర్చలు జరగడంతో సంఘ్‌, బీజేపీ కలసి పనిచేయాలని డిసైడ్ అయ్యాయి. ఆ చర్చల తర్వాత దోస్తీ ఫలితమే మహాలో మహాయుతి విజయమని అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇప్పుడు హస్తినలో కూడా బీజేపీ కోసం అన్నీ తామై పనిచేసేందుకు సంఘ్‌ రంగంలోకి దింగింది. డోర్ టు డోర్ ప్రచారం..సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలను కలిసేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు. దీంతో హస్తిన రాజకీయం ఆసక్తికరంగా మారింది. హోరాహోరీగా సాగుతున్న పోరులో అంతిమ విజేత ఎవరో వేచిచూడాల్సివుంది.