చిరు చిన్న కుమార్తెతో సానియా అడుగులు.. వీరు చేస్తున్నదేమంటే?
కెరీర్ కొనసాగుతుండగానే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని ఓ అబ్బాయికి తల్లయింది.
By: Tupaki Desk | 6 Jan 2025 11:30 AM GMTభారత్ లో అసలు టెన్నిస్ కు అందులోనూ మహిళల టెన్నిస్ లో చోటుందా? అనే ప్రశ్న నుంచి.. మనదగ్గర నుంచి సైతం చాంపియన్లు పుట్టగలరని నిరూపించింది హైదరాబాదీ సానియా మీర్జా. 20 ఏళ్ల పాటు దేశ టెన్నిస్ కు ఐకాన్ గా నిలిచింది. కెరీర్ కొనసాగుతుండగానే పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని ఓ అబ్బాయికి తల్లయింది. అయినప్పటికీ భారత్ తన సొంత దేశమని గర్వంగా చెప్పేది సానియా. మరి దాదాపు రెండేళ్ల కిందటనే టెన్నిస్ నుంచి రిటైరైన ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారు..? భర్తతో నిరుడు విడిపోయిన ఆమె సొంత నగరం హైదరాబాద్ లోనే ఉన్నారా? దుబాయ్ లో కొనుక్కున్న ఫ్టాట్ లో ఉంటున్నారా? అనేది అభిమానులకు అంతుపట్టలేదు.
రాకెట్ వదిలి.. చిన్నారుల చేయి పట్టి
చిన్నారుల శారీరక దారుఢ్యం, చదువు కోసం వినూత్న రీతితో నిరుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఏర్పాటైంది సీసా స్పేసెస్. రాకెట్ వదిలి పెట్టిన సానియా ఇప్పుడు ఈ సంస్థతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, సీ సా స్పేసెస్ పార్ట్ నర్ లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదెల. ఆదివారం ఈ సంస్థ కార్యాలయంలో సానియా మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లలంతా ఫోన్లు, ట్యాబ్ లు, టీవీలకు అతుక్కుపోతున్నారని, ఐప్యాడ్ ఉంటేనే అన్నం తింటున్నారని వాపోయింది. తల్లిగా ఈ సమస్య తనకు తెలుసని చెప్పింది. పిల్లలకు చదువు ఒక్కటే కాదని, మంచి ఆహారం, వాతావరణం, ఫిట్ నెస్ ఎంతో అవసరం అని.. ఆ అంశాల్లో సీసాతో కలిసి పనిచేస్తానని తెలిపింది.
సానియా ఆటలోనే కాదు జీవితంలోనూ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. క్రీడలో ఎన్నోసార్లు గాయాలపాలైంది. షోయబ్ తో విడాకుల అనంతరం భారత్ లోనే ఉంటోంది. వ్యక్తిగతంగా చూస్తే సానియా 15 ఏళ్లకే టెన్నిస్ లో అడుగుపెట్టింది. ఇప్పుడు తన ఏకైక కుమారుడు భవిష్యత్తుపైనే శ్రద్ధ పెట్టింది. ఇక షోయబ్ నుంచి విడిపోయాక ఆమె జీవితంలో ఏం నిర్ణయం తీసుకుంటారా? అని అందరూ ఎదురుచూశారు. టీమ్ ఇండియా క్రికెట్ స్టార్ తో ముడిపెట్టి అతడిని పెళ్లి చేసుకోనుందంటూ కథనాలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సానియా తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసింది.