Begin typing your search above and press return to search.

కెనడాలో ఏం జరుగుతోంది? భారతహైకమిషనర్ సంజయ్ వర్మ సంచలనం

ఈ సందర్భంగా కెనడాలో అసలేం జరుగుతోంది? అన్న అంశంపై సంచలన నిజాల్ని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 9:30 AM GMT
కెనడాలో ఏం జరుగుతోంది? భారతహైకమిషనర్ సంజయ్ వర్మ సంచలనం
X

ఒక వేర్పాటువాది.. ఒక ఉగ్రవాది హత్య జరిగితే.. నానా యాగీ చేస్తున్న కెనడాలో అసలేం జరుగుతోంది? ఒక వేర్పాటువాదానికి వంత పలుకుతూ భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంపై దాడి చేసేందుకు కెనడా ఎందుకు బరితెగిస్తోంది? ఈ అనైతిక వ్యవహారం వెనుకున్న అసలు సంగతేంటి? కెనడాలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఎపిసోడ్ లో ఆరోపణలు ఎదుర్కోవటం.. అక్కడి ప్రభుత్వ విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ప్రకటనల నేపథ్యంలో భారత్ కు తిరిగి వచ్చిన కెనడా భారత హైకమిషనర్ సంజయ్ వర్మ తాజాగా పీటిఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కెనడాలో అసలేం జరుగుతోంది? అన్న అంశంపై సంచలన నిజాల్ని వెల్లడించారు.

భారత్ - కెనడా దౌత్య బంధంలో భారీ బీటలు వారిన వేళ సంజయ్ చెప్పిన కీలక అంశాల్ని చూస్తే.. కెనడా వైఖరిలో మార్పునకు కారణాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల్లో ముఖ్యాంశాల్ని చూస్తే..

- కెనడాలో ప్రభుత్వం మొదలు రక్షణ బలగాలు.. చివరకు పార్లమెంట్ వరకు అన్ని రాజ్యాంగబద్ధ సంస్థల్లోకి ఖలిస్తానీ సానుభూతిపరులు చొరబడ్డారు. దీంతో..ఖలిస్తానీవాదులు తమ అజెండాను బలంగా ముందుకు వస్తున్నారు.

- భారత సార్వభౌమత్వాన్ని సైతం సవాలు చేసే సాహసం చేస్తున్నారు. మన సమగ్రతను అక్కడి ఎంతో మంది కెనడియన్ పార్లమెంటేరియన్లు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.

- మిత్రదేశంగా కెనడా... భారత సమగ్రతను గౌరవిస్తుందని తాను భావించానని.. వాళ్లు మాత్రం వెన్నుపోటు పొడిచారు. అత్యంత అనైతికంగా వ్యవహరించారు.

- ఖలిస్తానవాదుల కారణంగా కెనడా విదేశాంగ విధానం తప్పుడు పద్దతుల్లోకి వెళుతోంది. ఓటు బ్యాంక్ ను రక్షించుకోవటానికి రాజకీయ నేతలకు ఖలిస్తానీ వాదుల మద్దతు అవసరమైంది. ఇదే ఇరు దేశాల దౌత్య సంబంధాల క్షీణతకు కారణమవుతోంది.

- రోజురోజుకు కెనడా రాజకీయ ముఖచిత్రంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల పాత్ర ఎక్కువ అవుతోంది. అక్కడి భారత సంతతి ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతుంటే.. ఖలిస్తానీవాదులు మాత్రం తమ అనైతిక డిమాండ్ల కోసం తెగిస్తున్నారు.

- ఖలిస్తాన్ వాదనను కెనడాలో ఒక వ్యాపారంగా మార్చేశారు. ఆయుధాలు.. మత్తుపదార్థాల అమ్మకాలు.. అక్రమ రవాణా .. వ్యభిచారం.. బెదిరింపులు లాంటి అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.

- అక్టోబరు 12 సాయంత్రం టొరంటో ఎయిర్ పోర్టులో ఉన్నప్పుడు తనకో మెసేజ్ వచ్చిందని.. అర్జెంట్ గా కెనడా విదేశాంగ శాఖకు వచ్చి అధికారులను కలవాలన్న సందేశం అందులో ఉందన్నారు. 13న గ్లోబల్ అఫైర్స్ కెనడా ఆఫీసుకు తాను.. డిప్యూటీ హైకమిషనర్ వెళ్లామని.. నిజ్జర్ హత్య కేసులో మా ప్రమేయం ఉందని.. మమ్మల్ని ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు మిమ్మల్నివిచారిస్తారు.. విచారణకు అవరోధంగా ఉండి.. మిమ్మల్ని కాపాడుతున్న దౌత్య రక్షణను తీసేస్తామని కెనడా అధికారులు తమతో చెప్పినట్లు పేర్కొన్నారు.

- వారి మాటల్ని విన్న తర్వాత మాకో విషయం అర్థమైంది. దౌత్యనీతిని అవహేళన చేస్తూ..నిబంధనలకు నీళ్లు వదిలేస్తూ హైకమిషనర్ ను ప్రశ్నిస్తామని చెప్పటంతో నిర్ఘాంతపోయాం. పలుదేశాల్లో దౌత్యవేత్తగా పని చేసిన తనకు.. గడిచిన 36 ఏళ్ల కెరీర్ లో ఇలాంటి అవమానాన్ని తాను దేశంలోనూ ఎదుర్కోలేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు తాము పాల్పడలేదని.. అయినా దౌత్యవేత్తలతో వ్యవహరించాల్సిన పద్దతి ఇది కాదన్నారు.