ఆమె అందాన్ని చూసే... మహిళా ఎంపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు!
ఈస్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సంజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
By: Tupaki Desk | 31 July 2023 2:03 PM GMTసాధారణంగా పార్టీలు మారిన అనంతరం తమ పాత పార్టీ అధినేతలపైనా, సాటి నేతలపైనా కీలక వ్యాఖ్యలు చేస్తుంటారు కొంతమంది రాజకీయ నాయకులు. మరికొంతమంది అయితే శృతిమించిన వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇంకొంతమంది అభ్యంతరకరమైన, అసభ్యకరమైన విమర్శలు సైతం చేస్తుంటారు. తాజాగా శివసేన ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
అవును... తాజాగా ఓ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన వర్గంలో ఉంటూ... మాజీ అధినేత కుమారుడిపైనా.. ఆ పార్టీకి చెందిన మహిళా ఎంపీపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఆ మహిళా ఎంపీ తీవ్రంగా స్పందించి మండిపడ్డారు.
వివరాళ్లోకి వెళ్తే... శివసేన (శిందే వర్గం)లోని ఎమ్మెల్యే సంజయ్ శీర్సత్ తాజాగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎంపీ ప్రియాంక చతుర్వేది అందాన్ని చూసి ఆదిత్య ఠాక్రే ఆమెకు రాజ్యసభలో స్థానం కల్పించారని అన్నారు.
ఈస్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో సంజయ్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక చతుర్వేది తీవ్రంగా స్పందించారు.
"నేను ఎలా ఉన్నానో.. ఎక్కడ ఉన్నానో మీలాంటి వారు చెప్పాల్సిన అవసరం లేదు.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు.. ఇవి మహిళల హుందాను దిగజార్చేలా ఉన్నాయి.. వారి అభిప్రాయాలను గౌరవించండి" అని ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అనంతరం తర్వాత ఆదిత్య ఠాక్రే కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. "వక్రబుద్ధితో ఆలోచిస్తున్నారు.. ఇలాంటి నీచమైన మనస్తత్వం గల వ్యక్తులు ఎలా రాజకీయాల్లో ఉన్నారో నాకు అర్థం కావడం లేదు" అని మండిపడ్డారు.
అయితే... ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరే.. గతంలో ప్రియాంక చతుర్వేది గురించి తనతో చెప్పిన మాటలనే తాను ఇప్పుడు చెప్పానని సంజయ్ వివరణ ఇవ్వడం గమనార్హం. కాగా... ప్రియాంక చతుర్వేది 2019లో కాంగ్రెస్ ను వీడి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేనలో చేరారు.