జగన్ కు మద్దతుపై శివసేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
ఇదే క్రమంలో... దేశంలో కేంద్ర హోంమంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే... వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
By: Tupaki Desk | 24 July 2024 9:48 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అరాచక పాలన జరుగుతుందంటూ విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ... నేడు ఆ నిరసనను ఢిల్లీ వేదికగా తెలపాలని భావించి ధర్నా చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ నుంచి మద్దతు లభించగా.. తాజాగా శివసేన (యూబీటీ) తన మద్దతు ప్రకటించింది.
అవును... ఢిల్లీలో వైసీపీ తలపెట్టిన ధర్నాకు ఇప్పటికే ఇండియా కూటమికి చెందిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తన మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో... ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో తమ మద్దతూ ఉందని తెలిపిన శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తొలుత ఏపీలో నెలకొన్న కొన్ని పరిస్థితులకు సంబంధించి వైసీపీ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీ, వీడియోలను చూసిన ఆయన.. అనంతరం మైకందుకున్నారు. ఈ సందర్భంగా... ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... వైఎస్ జగన్ కు అండగా నిలవడం కోసమే తాను ఈరోజు ఇక్కడికి వచ్చినట్లు తెలిపిన శివసేన ఎంపీ.. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఈ తరహా ఘటనలు జరగడం సరికాదని.. ఏపీలో గత 45 రోజులుగా నరమేదం కొనసాగుతోందని.. అది దేశానికే మంచిది కాదని తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా చెప్పినట్లు తెలిపారు.
ఇదే క్రమంలో... దేశంలో కేంద్ర హోంమంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే... వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఓ ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపి, జరుగుతున్న దాడులు, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే... ఈ ఫోటోలు, వీడియోలు చూసిన తర్వాత... ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదని అన్నారు.