Begin typing your search above and press return to search.

బీజేపీ నేత కాళ్లు మొక్కిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే... వీడియో వైరల్!

ఈ సమయంలో కైలాష్‌ విజయ వర్గియా ను చూసిన సంజయ్‌ శుక్లా.. అతడి వద్దకు వెళ్లారు. ఏమి జరుగుతుందో అనుకునేలోపు ఉన్నపలంగా ఆయన కైలాష్‌ పాదాలకు శుక్లా నమస్కరించారు.

By:  Tupaki Desk   |   9 Oct 2023 3:17 PM GMT
బీజేపీ నేత కాళ్లు మొక్కిన కాంగ్రెస్‌  ఎమ్మెల్యే... వీడియో వైరల్!
X

తెలంగాణతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ ఐదు రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన సంఘటన తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో... తనపై పోటీ చేస్తున్న బీజేపీ నేత కాళ్లుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మొక్కారు!

ప్రస్తుతం బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది! ఈసారి ఎలాగైనా మోడీని గద్దె దింపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని “ఇండియా” కూటమి విశ్వప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మల్లగుల్లాలు పడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కాళ్లకు మొక్కారు కాంగ్రెస్ ఎమ్మెల్యే.

వివరాళ్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌ లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. ఇండోర్‌ లో జరిగిన ఓ కార్యక్రమానికి.. ఇండోర్‌-1 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్‌ శుక్లా హాజరయ్యారు. ఇదే సమయంలో బీజేపీ పార్టీకి చెందిన సీనియర్‌ నేత కైలాష్‌ విజయ వర్గియా కూడా విచ్చేశారు.

ఈ సమయంలో కైలాష్‌ విజయ వర్గియా ను చూసిన సంజయ్‌ శుక్లా.. అతడి వద్దకు వెళ్లారు. ఏమి జరుగుతుందో అనుకునేలోపు ఉన్నపలంగా ఆయన కైలాష్‌ పాదాలకు శుక్లా నమస్కరించారు. అనంతరం ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ఈ విషయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

కాగా... సంజయ్ శుక్లా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఇండోర్-1 అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరోసారి బరిలోకి దిగబోతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి విజయవర్గియాకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల జాబితాలను కమలం పార్టీ ప్రకటించింది.

అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనప్పటికీ... ఈ టిక్కెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శుక్లాకే ఇస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో... మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటికే ఢిల్లీలో సమావేశమైంది. మరోవైపు దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే.

ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఇప్పటికే కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి బీజేపీ ఇంకా తేరుకోలేదని అంటున్నారు. ఇప్పటికే ఆ ఎఫెక్ట్ తెలంగాణపై పడిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఐదురాష్ట్రాల ఎన్నికలను రెండు కూటములూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.