Begin typing your search above and press return to search.

సీఎం ఇంట్లో మహిళా ఎంపీకి వేధింపులు.. బాంబు పేల్చిన మరో ఎంపీ

సార్వత్రిక ఎన్నికల వేళ మలివాల్ నియోజకవర్గం నుంచి న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారు కేజ్రీవాల్.

By:  Tupaki Desk   |   15 May 2024 4:00 AM GMT
సీఎం ఇంట్లో మహిళా ఎంపీకి వేధింపులు.. బాంబు పేల్చిన మరో ఎంపీ
X

నిత్యం నీతులు చెప్పే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ మహిళా ఎంపీకి ఎదురైన దారుణ అనుభవం బయటకు రావటం తెలిసిందే. ఈ ఉదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. అందుకు భిన్నంగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ సంజయ్ సింగ్ సైతం తమ మహిళా ఎంపీకి ఎదురైన పరిస్థితుల గురించి వెల్లడించారు. అసలేం జరిగిందో తాను ముఖ్యమంత్రికి చెప్పానని.. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పటం గమనార్హం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు వచ్చిన ఆ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మిలివాల్ పై సీఎంకు సహాయకుడిగా వ్యవహరించే బిభవ్ కుమార్ దుర్మార్గాల్ని వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికల వేళ మలివాల్ నియోజకవర్గం నుంచి న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారు కేజ్రీవాల్. దీనిపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు స్వాతి మలివాల్. ఆమె సీఎం డ్రాయింగ్ రూంలో కూర్చున్న వేళ ఏం జరిగిందో వెల్లడించారు ఎంపీ సంజయ్ సింగ్. ‘‘ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కలిసేందుకు ఎంపీ స్వాతి మలివాల్ డ్రాయింగ్ రూంలో వెయిట్ చేస్తున్నారు. బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె పోలీసులకు ఫోన్ చేశారు’’ అని వెల్లడించారు.

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి నివాసంలో సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు వేధింపులకు గురి కావటం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. రాజకీయ ప్రత్యర్థులకు ఇదో ప్రచార అస్త్రంగా మారింది. తనపై దాడి జరిగినట్లుగా పేర్కొన్న రాజ్యసభ సభ్యురాలు స్వాతి.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకపోవటం తెలిసిందే. మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసే ఉదంతంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ.. ముఖ్యమంత్రి నివాసంలో చోటు చేసుకున్న సిగ్గుమాలిన చర్య మీద ముఖ్యమంత్రి ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.