కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్... ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.
By: Tupaki Desk | 5 April 2024 9:53 AM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారం మరింత సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఢిల్లీ సీఎం అరెస్ట్ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోందని తెలుస్తుంది. ఈ సమయంలో కేజ్రీవాల్ అరెస్ట్, మాంగుంట రాఘవకు బెయిల్ మొదలైన విషయాలపై ఆప్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఆరు నెలల పాటు తీహార్ జైల్లో ఉండి తాజాగా బెయిల్ పై బయటకు వచ్చిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు. ఇందులో భాగంగా... ఆయన కేజ్రీవాల్ అరెస్ట్ పై కాషాయం పార్టీ కుట్ర ఉందని విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవ కు బెయిల్ వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు!
అవును... లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఎటువంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవని.. కేవలం కుట్రలు చేసే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని.. ఆప్ ను నాశనం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రయత్నాల్లో ఇదొకటని మొదలుపెట్టిన సంజయ్ సింగ్... కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని.. ఆ తర్వాతే రాఘవకు బెయిల్ ఇచ్చారని.. ఇప్పుడు టీడీపీ టిక్కెట్ ఇవ్వడంతో మోడీ ఫోటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారని కామెంట్స్ చేశారు!!
అరవింద్ కేజ్రీవాల్ మీకు తెలుసా అని మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఈడీ మొదట అడిగినప్పుడు, అతను నిజం చెప్పాడని చెప్పిన సంజయ్ సింగ్... తాను అరవింద్ కేజ్రీవాల్ ను కలిశానని, అయితే చారిటబుల్ ట్రస్ట్ భూమి విషయంలో కలిశానని చెప్పాడని తెలిపారు. అయితే ఆ తర్వాత కొడుకుని అరెస్ట్ చేసి 5 నెలల పాటు జైలులో ఉంచడంతో.. తండ్రి స్టేట్ మెంట్ మార్చాడని ఆరోపించారు.
ఇదే సమయంలో... ఫిబ్రవరి 10 - జూలై 16 మధ్య మాగుంట రాఘవ నుంచి ఏడు స్టేట్ మెంట్లు తీసుకోబడ్డాయని.. ఈ ఏడు స్టేట్ మెంట్ లలోనూ మొదటి ఆరింటిలో కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అతను ఏమీ మాట్లాడలేదని అన్నారు. ఈ సమయంలో జూలై 16న ఇచ్చిన ఏడో స్టేట్ మెంట్ లో మాత్రం తన వైఖరిని మార్చుకుని, కుట్రలో భాగస్వామి అయ్యాడని.. ఫలితంగా, అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని.. దీంతో బెయిల్ దక్కిందని సంజయ్ చెబుతున్నారు!!
కాగా.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున ఒంగోలు నుంచి శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ముందుగా ఈ టిక్కెట్ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవకు ఇస్తున్నట్లు కథనాలొచ్చినా.. చివరి నిమిషంలో చంద్రబాబు శ్రీనివాస్ రెడ్డినే ఎంపిక చేశారు!!