Begin typing your search above and press return to search.

సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా.. హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఇవే!

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 4:13 AM GMT
సీజేఐగా జస్టిస్ సంజీవ్  ఖన్నా.. హిస్టారికల్  జడ్జిమెంట్స్ ఇవే!
X

భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు 51వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియ్యా జస్టిస్ డీ వై చంద్రచూడ్ స్థానంలో నవంబర్ 11, 2024న బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఇందులో భాగంగా... "భారత రాజ్యాంగం ద్వారా అందించబడిన అధికారాన్ని ఉపయోగించి.. గౌరవనీయులైన రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన తర్వాత.. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నాను భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తునాను" అని పేర్కొన్నారు.

అవును... సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. తన పదవీకాలం నవంబర్ 10న ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫార్సుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

హిస్టారికల్ జడిమెంట్స్..!:

సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా... చారిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో కీలక భూమిక పోషించారు. ఇందులో భాగంగా... 370వ రాజ్యాంగ అధికరణ రద్దు, ఈవీఎంల వినియోగానికి సమర్ధన, ఎన్నికల బండ్లు వంటి తీర్పులను ఇచ్చిన ధర్మాసనాల్లో భాగసామిగా ఉన్నారు.

ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..?:

జస్టిస్ సంజీవ్ ఖన్నా.. మే 14, 1960లో జన్మించారు. 1977లో న్యూ ఢిల్లీలోని మోడరన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసి, 1980లో సెయింట్ స్టీఫెన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. తర్వాత.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం 1983లో ఢిల్లీ బార్ కౌన్సిలో లాయర్ గా నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో.. ఢిల్లీ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన.. తర్వాత కాలంలో ఢిల్లీ హైకోర్టు, ట్రిబ్యునళ్లకు మారారు. ఈయన రాజ్యాంగ చట్టం, కంపెనీ లా, భూ చట్టాలు, ప్రత్యక్ష పన్ను విధానం, కమరిషియల్ లా, ఎన్విరాన్మెంటల్ లా, పర్యావరణం - కాలుష్య చట్టాలు, వైద్యపరమైన నిర్లక్ష్యం వంటి రంగాల్లో ప్రాక్టీస్ చేశారు.

ఈ క్రమంలో 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్) గా నియమించబడ్డారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఢిల్లీ హైకోర్టులో అనేక క్రిమినల్ కేసులను వాదించారు. ఈ క్రమంలో 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎదిగిన జస్టిస్ ఖన్నా... 20 ఫిబ్రవరి 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఇలా సుమారు 14 సంవత్సరాల పాటు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ సమయంలోనే ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ ఛైర్మన్ గానూ నియమితులయ్యారు. ఇదే క్రమంలో... 2019 జనవరి 18న ఆయన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

అనంతరం 2023 జూన్ 17 నుంచి 2023 డిసెంబర్ 25 వరకూ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీలో ఛైర్మన్ గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ - భోపాల్ పాలక న్యాయవాదిగా ఉన్నారు.