Begin typing your search above and press return to search.

రాహుల్ కు చేదు అనుభవం... సమస్య ఏమిటి బ్రదర్?

ప్రస్తుతం అస్సాంలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది

By:  Tupaki Desk   |   22 Jan 2024 5:59 AM GMT
రాహుల్ కు చేదు అనుభవం... సమస్య ఏమిటి బ్రదర్?
X

ప్రస్తుతం అస్సాంలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రవేశించకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రాహుల్ వాగ్వాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీంతో... మోడీ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారని తెలుస్తుంది.

అవును... ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా అస్సాంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. ఇందులో భాగంగా అస్సాంలోని బటద్రవ థాన్‌ ను సందర్శించకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాలను స్వయంగా వెల్లడించిన రాహుల్... శ్రీమంత శంకర్‌ దేవా జన్మస్థలమైన అస్సాంలోని బటద్రవ థాన్‌ ను సందర్శించకుండా తనను నిలిపివేశారని తెలిపారు.

ఈ సందర్భంగా తనను అడ్డుకున్న పోలీసులతో మాట్లాడిన రాహుల్... ఇష్యూ ఏమిటి బ్రదర్? నేను లోపలికి ఎందుకు వెళ్లకూడదు? నేనేమి తప్పు చేశాను? అసలు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం కారణంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో రాహుల్ అసహనం వ్యక్తం చేశారు.

అంతక ముందు నాగాన్‌ జిల్లా కలియాబోర్‌ లో నిర్వహించిన సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ... బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇందులో భాగంగా... మణిపుర్‌ లో కొన్ని నెలలుగా హింస జరుగుతున్నా కూడా... నేటివరకూ ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఆక్షేపించారు. ఒకవేళ కాంగ్రెస్‌ ప్రధాని ఉండి ఉంటే హింస చెలరేగిన మూడో రోజే మణిపుర్‌ ను సందర్శించేవారని.. ఆ తర్వాతి రోజే పరిస్థితుల్ని నియంత్రించేవారని తెలిపారు.

ఇదే సమయంలో తాము చేస్తున్నది సైద్ధాంతిక పోరాటమని, ఎవరికీ భయపడేది లేదని తెలిపిన రాహుల్ గాంధీ... అస్సాంలో ఉన్న దుస్థితికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం హిమంత బిశ్వశర్మలే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా... దేశంలో అత్యంత అవినీతి పరుడైన సీఎం హిమంత బిశ్వశర్మేనని, ఈ విషయంలో అస్సాంలోని చిన్నపిల్లలను అడిగినా చెబుతారని అన్నారు.

భారతీయ జనతాపార్టీ పాలనలో అస్సాం ఎంతో నష్టపోతుందని.. ఇందులో భాగంగా యువతకు ఉద్యగాల్లేవని.. ప్రైవేటు కాలేజీల్లో లక్షలాది రూపాయులు ఫీజులు చెల్లించి చదువుకున్నా కూడా ఉపాధి దొరకడంలేదని ఆరోపించారు. ఏడాది పొడువునా శ్రమించిన రైతులు సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర కూడా రావడంలేదని దుబ్బయట్టారు.