సంక్రాంతిని సైతం వాడేస్తున్నారా ?
ఇపుడు తెలుగు నాట అతి పెద్ద పండుగగా ఉన్న సంక్రాంతి విషయంలోనూ రాజకీయ నేతలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
By: Tupaki Desk | 14 Jan 2025 3:36 AM GMTదేదీ రాజకీయాలకు అనర్హం అని నేతాశ్రీలు పార్టీలు రుజువు చేస్తున్నారు. ఏ పార్టీ అయినా ఏ విషయంలో అయినా రాజకీయాన్ని చూడడానికే అలవాటు పడిపోయింది. ఆఖరుకు పండుగలు కూడా వదలడం లేదా అన్న చర్చ వస్తోంది. ఇపుడు తెలుగు నాట అతి పెద్ద పండుగగా ఉన్న సంక్రాంతి విషయంలోనూ రాజకీయ నేతలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
ఈసారి సంక్రాంతి పండుగ కళ కట్టడం లేదు అని వైసీపీ నేతలు విమర్శల దాడిని స్టార్ట్ చేశారు. పచ్చని సంక్రాంతి పల్లెలలో లేదని పచ్చ పార్టీ నేతలకే సంక్రాంతి వచ్చింది అని మాజీ మంత్రి రోజా విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ హయాంలో అయితే ప్రతీ నెలా ఏదో పధకం కింద నగదు బదిలీని లబ్దిదారుల ఖాతాలలో వేసేవారని దాని వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఆడుతూ ఉండేవని ఆమె చెప్పారు.
దాంతో సంక్రాంతి పండుగను వారు బాగా జరుపుకునే వారు అని ఆమె అన్నారు. ఇపుడు సూపర్ సిక్స్ హామీలు అన్నీ అటకెక్కాయని అంతే కాకుండా ధరలు దారుణంగా పెరిగి నిత్యావసరాలు కూడా అందనంత ఎత్తున ఉన్నాయని దాంతో పేదల ముంగిట సంక్రాంతి సందడి కానరావడం లేదని ఆమె విమర్శించారు.
దీని మీద కూటమి మంత్రి కొలుసు పార్ధసారధి అయితే మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతలను రోజాను కూడా ఘాటైన పదజాలంతో విమర్శించారు. రోజావి గాలి మాటలు అని ఆయన సెటైర్లు వేశారు. పచ్చగా పల్లెలలో జరుపుకునే పండుగ సంక్రాంతి అని అది ఈ ఏడాదే బాగా జరుగుతోందని ఆయన చెప్పారు.
క్షేత్ర స్థాయిలో వెళ్ళి చూస్తే అర్ధం అవుతుందని అన్నారు. ఓటమి తరువాత అయినా వైసీపీ నేతలకు ఏమీ బోధపడడం లేదని ఆయన నిందించారు. పార్ధసారధి మాత్రమే కాదు కూటమి నేతలు అంతా గత అయిదేళ్లుగా ప్రజలు సంక్రాంతి పండుగను సరిగ్గా చేసుకోలేకపోయారని ఈసారి ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు
ఇలా సంక్రాంతి పండుగ సైతం రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శల మధ్య పడి నలిగిపోతోంది. ఈ విషయం అలా ఉంచితే ఏ ఏటికి ఆ ఏడు ధరలు అయితే బాగా పెరుగుతున్నాయి. ఇంటిల్లిపాదీ మూడు పండుగలకూ మూడేసి వంతున బట్టలు కొనుక్కునేవారు ఇపుడు ఒక్క బట్ట కొనుక్కోవాలన్నా ఇబ్బందిగానే ఉంది.
అంతే కాదు సొంతూళ్లకు వెళ్ళాలీ అంటే కూడా బస్సు చార్జీలు పెంచేశారు ప్రైవేట్ ఆపేఅటర్లు. చాలినన్ని రైళ్ళు బస్సులూ లేక జనాలు అధిక చార్జీలను పెట్టుకోలేక అలా ఉండిపోతున్నారు. అలాగే ఏ ప్రభుత్వం ఉన్నా నిత్యావసరల ధరలు పెరుగుతూ పోతున్నాయి. దాంతో పండుగలకు సరుకులు కొనుక్కోవడం అంటే కూడా ఇబ్బందిగానే ఉంటోంది అన్నది సామాన్యుల మాట. దీనికి ప్రభుత్వాలు ఏవైనా చేయగలిగేది చేస్తాయి. కానీ పెరిగే ధరలు ఆపడం ఎవరి వల్ల కావడం లేదన్నది నిష్టుర సత్యంగానే ఉంది.