నా కొడుకే సీఎం అంటున్న తల్లి!
అయితే గెలిచిన పార్టీలలో కూడా ఆనందం ఉందా అంటే లేదనే అంటున్నారు.
By: Tupaki Desk | 24 Nov 2024 4:29 AM GMTమహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పార్టీల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే చరిత్ర ఎరుగని ఓటమిని వారు మూటగట్టుకున్నారు. దాంతో భవిష్యత్తు తెలియక అల్లల్లాడుతున్నారు. అయితే గెలిచిన పార్టీలలో కూడా ఆనందం ఉందా అంటే లేదనే అంటున్నారు. బీజేపీకి సొంతంగా 132 సీట్లు దక్కాతు, షిండే శివసేనకు 57 సీట్లు దక్కాయి. అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు లభించాయి.
దీంతో సీఎం ఎవరు అవుతారో తెలియక తికమక ఏర్పడింది. అదే టైంలో ఉత్కంఠ కూడా ఎక్కువగానే ఉంది. ఏక్ నాధ్ షిండే వర్గం అయితే మాకే సీఎం పదవి అని అంటోంది. ఇక అజిత్ పవార్ తన సొంత బాబాయ్ ని సైతం పక్కన పెట్టేసి బీజేపీ వైపు వచారు. ఆయన తన శక్తి కొలదీ శ్రమించి భారీ విజయం అందుకున్నారు.
ఎన్సీపీ ఒక్కటిగా ఉన్నపుడు కంటే అజిత్ పవార్ నాయకత్వంలో ఉన్నపుడే ఎక్కువ సీట్లు సాధించింది. అలాగే ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో శివసేన 2019 కలసి ఉన్న పార్టీ కంటే ఒక సీటు సాధించింది. అప్పట్లో 56 మాత్రమే శివసేనకు లభించాయి.
ఈ మొత్తం పరిణామాలను చూస్తే విజేతలు అందరూ జనం మద్దతు దండీగా సంపాదించిన వారే. దాంతో పాటు అంతా కలసికట్టుగా ఉంటేనే విజయం దక్కింది అన్నది నిజం. అయితే బీజేపీ 105 సీట్లు గతంలో వచ్చినపుడే సీఎం పోస్టు కోసం చూసింది. ఇపుడు ఏకంగా 132 సీట్లు దక్కాయి.
మ్యాజిక్ ఫిగర్ కి 13 సీట్లు మాత్రమే తక్కువ. దాంతో ఆ పార్టీ సీఎం పోస్టుని అసలు వదులుకోదు అని అంటున్నారు. దాంతోనే మిత్రులు కలవరపడుతున్నారు. వారికి గెలుపు ఆందం కంటే తమ మీద బీజేపీ పెద్దగా ఆధారపడక్పోవడం ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు
ఈ నేపధ్యంలో అభినవ అభిమన్యుడిని పద్మవ్యూహాన్ని ఛేదించాను అని మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ అంటున్నారు. ఆయన తల్లి సరితా ఫడ్నవీస్ అయితే తన కుమారుడే మహారాష్ట్రకు కాబోయే సీఎం అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
ఆమె మీడియా ముందుకు వచ్చి తన కుమారుడికే సీఎం పదవి ఇస్తారు అని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన కుమారుడు అంటే చాలా ఇష్టం అని కూడా కొత్త విషయాన్ని చెప్పారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తన కుమారుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటారు అని అంటున్నారు.
కేవలం తాను మాత్రమే కాదు ప్రతీ ఒక్కరూ తన కుమారుడే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని చెప్పడం విశేషం. తన కుమారుడి అలుపెరగని కృషి ఫలితమే ఈ విజయం అని అన్నారు. గత రెండేళ్ళుగా విపక్షాలు తన కుమారుడిని టార్గెట్ చేస్తూ వస్తున్నాయని కూడా ఆమె చెప్పారు. దాంతో ఇపుడు మహాయుతి కూటమిలో సీఎం చిచ్చు చెలరేగుతోంది. మిత్రులు కూడా బలంగా ఉన్న వేళ ఎవరు సీఎం అవుతారు అన్నది చాలా క్లిష్టమైన ప్రశ్నగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.