నా సమయం ఆసన్నమైంది : శశికళ
ఈ మేరకు తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 17 Jun 2024 9:22 AM GMT''తమిళ ప్రజలు మనతో ఉన్నారు. నాకు నమ్మకం ఉంది. నేను ఇప్పటి వరకు చెబుతున్న సమయం ఆసన్నమయింది. అన్నాడీఎంకె పని అయిపోయిందని అనుకోవద్దు. ప్రతిపక్ష నాయకుడిగా పళనిస్వామి అధికార పక్షాన్ని నిలదీయలేకపోతున్నాడు. ఇక మీద నేనే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాను’’ అని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
అన్నాడీఎంకే పార్టీలోకి నా రీఎంట్రీ సమయం ఆసన్నమయింది. ఇటీవల వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనం అవుతుందని భావించాల్సిన అవసరం లేదు. 2026 శాసనసభ ఎన్నికల్లో తిరిగి గెలిచి తమిళనాడులో అమ్మ పాలనకు నాంది పలుకుతామని శశికళ అన్నారు.
అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని, ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని శశికళ గుర్తుచేసింది. అలాంటి పార్టీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహించడాన్ని పార్టీ కార్యకర్తలు సహించరని ఆమె అభిప్రాయపడింది. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయ్యి ఉండేవారు కాదని, అందరినీ ఏకం చేసి అన్నాడీఎంకే పార్టీని బలోపేతం చేయడే తన లక్ష్యం అని, ఇందుకోసం తన ప్రయత్నం మొదలు పెట్టినట్లు వెల్లడించింది.