Begin typing your search above and press return to search.

పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సత్తుపల్లి ఎమ్మెల్యేకు టోకరా

మోసగాళ్లలో ముదురు మోసగాళ్లు.. దేశ ముదురు మోసగాళ్లు ఉండటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 July 2024 10:30 AM GMT
పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో సత్తుపల్లి ఎమ్మెల్యేకు టోకరా
X

మోసగాళ్లలో ముదురు మోసగాళ్లు.. దేశ ముదురు మోసగాళ్లు ఉండటం తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఘనుడు ఈ కోవకే చెందుతాడు. ఇతగాడు ఏకంగా ఎమ్మెల్యేకే బిస్కెట్ వేశాడు. తాను హాజరైన కార్యక్రమం ఒక మోసగాడు.. మోసంతో ఏర్పాటు చేసిన కార్యక్రమన్న విషయాన్ని తెలుసుకొని సదరు ఎమ్మెల్యే గతుక్కుమన్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మట్టా రాగమయిని బోల్తా కొట్టించిన కేటుగాడి ఉదంతమిది.

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రానికి చెందిన అద్దంకి జనార్దన్ రావు మహా మాయగాడు. తాజాగా సత్తుపల్లి ఎమ్మెల్యేను కలిశాడు. తనను తాను మచిలీపట్నంలో ఎంపీడీవోగా పని చేస్తున్నట్లు చెప్పి.. పేద ప్రజలకు గూడు కల్పించాలన్న ఉద్దేశంతో ఏపీకి చెందిన న్యాయ నిపుణుడు పాటిబండ్ల చంద్రశేఖర్ గురుతుగా నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పుకున్నాడు.

మరోవైపు ఇతగాడు పాత కుప్పెనకుంట్ల ఎస్పీ కాలనీకి వచ్చి.. తాను చేపట్టిన కార్యక్రమం గురించి వివరించటంతో పాటు.. తాను నిర్మించే ఇళ్ల గురించి చెప్పుకున్నాడు. మొదటి విడతలో భాగంగా నాలుగు ఇళ్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇందుకు ఒక్కొక్కరు రూ.4వేలు ఇవ్వాలంటూ చెప్పుకున్నాడు. ఇతగాడి మాటలపై అనుమానం వచ్చిన కాలనీకి చెందిన నారపోగు శ్రీనివాసరావు పోలీసులకు సమాచారం అందించాడు.

రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఈ క్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయిని బోల్తా కొట్టించిన విషయాన్ని గుర్తించారు. ఈ నెల 8న సత్తుపల్లి నియోజవర్గం పెనుబల్లి మండలంలో 20 ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చేత శంకుస్థాపన చేయించాడు. పేద ప్రజలకు ఉచితంగా ఇళ్లు కట్టిస్తానంటూ చెప్పినంతనే నమ్మేసిన ఎమ్మెల్యేను తెలివిగా బోల్తా కొట్టించాడు. మరోవైపు తాను ఎమ్మెల్యే చేత శంకుస్థాపన చేసిన చోట.. ఇళ్లు కావాలంటే రూ.4 వేలు చొప్పున డబ్బులు ఇవ్వాలని చెప్పసాగాడు.

స్థానికులకు అనుమానం రావటంతో అతడి గుట్టు రట్టైంది. ఎమ్మెల్యేను బోల్తా కొట్టించిన ఇతగాడి టాలెంట్ కు జనాలు విస్తుపోతున్నారు. పోలీసుల విచారణలో ఇప్పటికే అద్దంకి జనార్దన్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 8 చీటింగ్ కేసులు ఉన్న విషయాన్ని గుర్తించారు. ఏపీలో మూడు కేసులు.. తెలంగాణలో ఐదు కేసులు ఇతడిపై నమోదైన విషయాన్ని గుర్తించారు.