మహానటిలా నటిస్తూ హత్యలు చేయిస్తున్నావు : పరిటాలపై తోపుదుర్తి ఫైర్
సత్యసాయి జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
By: Tupaki Desk | 4 April 2025 9:45 AMసత్యసాయి జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హతుడు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చే మంగళవారం వైసీపీ అధినేత జగన్ వస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా స్పందించారు. అనుకోని సంఘటనలో లింగమయ్య మరణించాడని, ఆయన మరణంపై తాము బాధపడుతున్నామని చెప్పిన సునీత, వైసీపీ అధినేత జగన్ జిల్లాకు వచ్చి ఒక్క లింగమయ్య కుటుంబాన్నే కాకుండా గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుల అరాచకాలకు బలైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన భర్త పరిటాల రవీంద్ర హత్యతో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి సంబంధం ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపణకు కౌంటర్ గా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వీడియో విడుదల చేశారు. తమ పార్టీ అధినేత జగన్ మహోన్నత వ్యక్తిత్వం కలవాడని, ఆయనపై విమర్శలు చేసే హక్కు ఎమ్మెల్యే సునీతకు లేదని వ్యాఖ్యానించారు. జగన్ కాలిగోటికి కూడా సునీత సరిపోరన్నారు. ప్రజలకు మంచి చేస్తారని మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే హత్యా రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. లింగమయ్య హత్యతో పరిటాల చాప్టర్ క్లోజ్ అయిందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలలుగా నియోజకవర్గంలో అరాచకాలు, దోపీడీలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపించారు.
ఎమ్మెల్యే సునీత భర్త అందరికీ తెలిసేలా హత్యలు చేయిస్తే, సునీత మాత్రం మహానటిలా నటిస్తూ ముసుగు వేసుకుని నేరాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా సునీత పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. మీ దుర్మార్గాలకు సరైన సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. 2029లో మళ్లీ జగనే సీఎం అవుతారని, అప్పుడు తమ తడాఖా చూపిస్తామన్నారు. తమను బెదిరించలేరని, రాబోయే రోజులన్నీ వైసీపీ పార్టీవే అని గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో జగన్ ను కోల్పోయినందుకు ప్రజలు చింతిస్తున్నారని తోపుదుర్తి తెలిపారు. రాబోయే కాలంలో టీడీపీ నేతలుహత్యలు చేయించిన వారి కుటుంబాలే పరిటాల కుటుంబానకి రాజకీయ సమాధి చేస్తాయని హెచ్చరించారు.