ఆయన జగన్ మీద ఈగ వాలనివ్వడం లేదుగా ?
అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు తగిన విధంగా పార్టీలో ప్రభుత్వంలో గౌరవం లేదని అర్ధమైందని అంటారు.
By: Tupaki Desk | 6 April 2025 3:44 AMదశాబ్దాల పాటు వైఎస్సార్ కుటుంబం తో ఆయనకు వైరం ఉంది. అది రాజకీయ వైరం. ఆయనే పులివెందులలో ఉండే సతీష్ రెడ్డి. ఆయనకు ఉన్న విశేషం ఏమిటి అంటే తండ్రితో పాటు తనయుడితోనూ ప్రతీ ఎన్నికల్లోనూ పులివెందుల నుంచి పోటీ పడ్డారు. సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మాత్రం ఏనాడూ ఎమ్మెల్యే కాలేకపోయారు. ఎమ్మెల్సీగా మాత్రం ఒకసారి పనిచేశారు.
సతీష్ రెడ్డి 1999 నుంచి 2019 దాకా వరసగా అయిదుసార్లు టీడీపీ టికెట్ మీద పోటీ చేశారు. ఆయన వైఎస్సార్ మీద మూడు సార్లు జగన్ మీద రెండు సార్లు ఓటమి పాలు అయ్యారు. ఆ సమయంలో వార్ వైఎస్సార్ ఫ్యామిలీ వర్సెస్ సతీష్ రెడ్డి అన్నట్లుగా సాగేది. 2011లో ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. మండలిలో డిప్యూటీ చైర్మన్ గా పనిచేశారు.
అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు తగిన విధంగా పార్టీలో ప్రభుత్వంలో గౌరవం లేదని అర్ధమైందని అంటారు. సరిగ్గా అదే సమయంలో బీటెక్ రవిని పార్టీ ప్రోత్సహించడంతో ఆయన కూడా చాలా కాలం పాటు రాజకీయాలకు దూరం అని వైరాగ్యం ప్రదర్శించారు.
ఇక చూస్తే ఆయన 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయన చేరడం రాజకీయంగా అనూహ్యమైనది గానే అంతా భావించారు. ఏ వైఎస్సార్ కుటుంబంతో దశాబ్దాలుగా రాజకీయ వైరం చేస్తూ వచ్చారో అదే ఫ్యామిలీతో సఖ్యత నెరపడం అంటే ఆశ్చర్యమే అని అనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఇవన్నీ మామూలే అని కూడా చెప్పుకున్నారు.
ఇక వైసీపీలో చేరిన దగ్గర నుంచి జగన్ మీద ఈగ వాలనీయకుండా సతీష్ రెడ్డి ఆయనకు బలంగా మారారు. ఏ ఇష్యూ వచ్చినా తనదైన శైలిలో ఆయన రియాక్ట్ అవుతూ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ ని బాగా కాసుకుని వస్తున్నారు.
తాజాగా జగన్ మీద షర్మిల చేసిన విమర్శలను కూడా సతీష్ రెడ్డి గట్టిగా తిప్పికొట్టారు. జగన్ మీద షర్మిల చేస్తున్నవి అన్నీ అనవసర ఆరోపణలుగా సతీష్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఆమె వ్యవహరిస్తున్నారని బాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఆమె ఈ విధంగా చేస్తున్నారని కూడా సతీష్ రెడ్డి విమర్శించారు.
తనకు ఆస్తులలో వాటా ఇవ్వడంలేదని షర్మిల చెప్పిన ఆస్తులు అన్నీ దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఉన్నాయని సతీష్ రెడ్డి అంటున్నారు. ఇక చూస్తే షర్మిల జగన్ ల మధ్య మధ్య కుదిరిన ఒప్పందం స్పష్టంగా ఉందని అన్నారు. అయితే టీడీపీ రాజకీయ ఇబ్బందుల్లో ఉన్నపుడల్లా ప్రజలను దాన్నుంచి డైవర్ట్ చేయడానికి షర్మిలను చంద్రబాబు తెరపైకి తెస్తున్నారని సతీష్ రెడ్డి విమర్శించారు.
మొత్తానికి ఆయన చెబుతూ మాట ఒక్కటే. చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల మీడియా ముందుకు వస్తున్నారని, అలాగే, జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని. ఇవన్నీ పక్కన పెడితే సొంత కుటుంబంలోని చెల్లెలు ఎదురుగా నిలిచి ప్రత్యర్థిగా మారి విమర్శలు చేస్తోంది. దశాబ్దాలుగా ఎదురుగా నిలిచి ప్రత్యర్థిగా రాజకీయ యుద్ధం చేస్తూ వచ్చిన సతీష్ రెడ్డి ఇపుడు పక్కన ఉన్నారు. జగన్ అంటే జనం అంటున్నారు. ఆయనను ఏమన్నా సహించను అంటున్నారు. దీనిని ఎలా చూడాలి అన్నదే చర్చగా ఉంది మరి.