కింగ్ ఆఫ్ మూన్స్ గా శని గ్రహం.. లేటెస్ట్ ఫీట్ వైరల్!
అవును... నిన్నమొన్నటివరకూ శనిగ్రహానికి 128 చందమామలే అని చెబుతోన్న వేళ.. తాజాగా మరో 128 చంద్రుళ్లు శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.
By: Tupaki Desk | 20 March 2025 8:15 AM ISTమన సౌర కుటుంబంలో మెర్క్యురీ (బుధుడు), వీనస్ (శుక్రుడు) గ్రహాలకు ఒక్క చంద్రుడు కూడా లేని సంగతి తెలిసిందే. అయితే... భూమికి ఒకటి, అంగారకుడికి రెండు చొప్పున చందమామలు ఉన్నాయి. ఇక మిగిలిన వాటిలో నెఫ్ట్యూన్ కి 16, యురేనస్ కు 28 చందమామలు ఉన్నాయి. గురుగ్రహానికి మాత్రం ఏకంగా 95 చందమామలు ఉన్నాయి.
అయితే... అదే పెద్ద సంఖ్య అనుకుంటే పొరపాటే. ఈ విషయంలో గురుగ్రహానికి, శనిగ్రహానికీ చందమామల విషయంలో నిత్యం ఫైట్ ఉండేది! ఇందులో భాగంగా... నిన్నటివరకూ గురుగ్రహానికి 95 చందమామలు ఉండగా.. శనిగ్రహానికి 146 చంద్రుళ్లు ఉండేవి. అయితే... ఇప్పుడు ఆ లెక్క మారిందని.. చంద్రసైన్యంలో శని ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిందని తెలుస్తోంది.
అవును... నిన్నమొన్నటివరకూ శనిగ్రహానికి 128 చందమామలే అని చెబుతోన్న వేళ.. తాజాగా మరో 128 చంద్రుళ్లు శనిగ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. దీంతో... ఇప్పుడు శనికి ఉన్న మొత్తం చంద్రుళ్ల సంఖ్య 274కి చేరినట్లయ్యింది. దీంతో.. మన సౌరకుటుంబంలో అత్యంధిక సంఖ్యలో చంద్ర సైన్యాన్ని కలిగి ఉన్న గ్రహంగా శని నిలిచింది!
ఈ క్రమంలో శనికి సంబంధంచిన ఈ కొత్త 128 చంద్రుళ్లలో 63 చంద్రుళ్లను 2019 - 21 మధ్య కాలంలో గుర్తించగా.. మిగిలిన వాటిని 2023లో గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఈ విషయాలను తైవాన్ కు చెందిన అకడెమియా సిన్సియా ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆస్టన్ వెల్లడించారు.
అలాగని.. ఈ 128 కొత్త చందమామలు భూగ్రహానికున్న చంద్రుడి అంత పరిమాణంలోను, గోళాకారంలోనూ లేవు. చాలా చిన్న సైజులో, రకరకాల ఆకారాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే... సౌరకుటుంబం ఆవిర్భవించిన మొదట్లో శని కక్షలోని గుర్తుత్వాకర్షణ శక్తి బంధించడం వల్ల ఇవన్నీ బుల్లి బుల్లి చంద్రుళ్లుగా మారి ఉంటాయని భావిస్తున్నారు.
కాగా... తాజాగా 274 చంద్రుళ్లతో రికార్డ్ సృష్టించిన శని రెండు లక్షల ఎనభై వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ వ్యాసంలో విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... అన్ని గ్రహాల్లో కెల్లా ఇది తేలికైన గ్రహంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ గ్రహంపై గంటకు 1,800 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.