Begin typing your search above and press return to search.

ఆ ప్రసక్తే లేదంటున్న సత్యకుమార్... జగన్ పై సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 11:16 AM GMT
ఆ ప్రసక్తే  లేదంటున్న సత్యకుమార్... జగన్  పై సంచలన వ్యాఖ్యలు!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... తిరుమల లడ్డూ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఇందులో భాగంగా... తిరుమల లడ్డూ వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా, వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తిలేదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ మొదటి నుంచీ తిరుపతి పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీస్తూనే వచ్చారని ఆరోపించారు. ఇది ఒక్క తిరుపతిలోనే కాదని.. హిందూ సంప్రదాయంపైనే జగన్ దాడులు చేశారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైనా మంత్రి స్పందించారు. ఇందులో భాగంగా... పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. పంది కొవ్వును బంగారంతో పోల్చడం దేవుడిని అపహాస్యం చేసినట్లేనని సత్యకుమార్ మండిపడ్డారు. తిరుమల లడ్డూలోని నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఎన్.డీ.బీ.బీ. కూడా చెప్పిందని తెలిపారు.

ఏది ఏమైనా... తిరుమలలో జరిగిన ఘటన హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని చెప్పిన మంత్రి... వైసీపీ నేతలు తిరుమలపైనే ఆలయ పవిత్రత తగ్గేలా ఎన్నోసార్లు మాట్లాడారని.. అసలు తిరుమల పుణ్యక్షేత్రంపై భక్తి ఉంటే.. ఆస్తులను వేలం వేసేవారు కాదని అన్నారు.

ఇక ప్రధాని మోడీ పుట్టిన రోజు నుంచి గాంధీ జయంతి వరకూ ఏక్ పేడ్ మా కే నాం.. తల్లికి ఒక మొక్క కార్యక్రమం చేపట్టామని.. ప్రకృతి సమతుల్యంగా ఉండాలని ప్రతీ విద్యార్థికీ అవగాహన ఉండేలా తెలియజేసేలా ఈ కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. ఇదే సమయంలో... రక్తదానం చేసేందుకు ప్రతీ విద్యార్థి, ప్రతీ ఒక్కరూ ముందుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు.