Begin typing your search above and press return to search.

ఏపీలో జీబీఎస్ కలకలం... మంత్రి కీలక సూచనలు!

ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   15 Feb 2025 4:42 AM GMT
ఏపీలో జీబీఎస్ కలకలం... మంత్రి కీలక సూచనలు!
X

ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదవుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సమయంలో.. ప్రభుత్వ అప్రమత్తమైంది. ఇటీవల ఈ వ్యాధి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో యువంత్ (10) అనే బాలుడు మృతి చెందినట్లు చెబుతున్నారు. మరోపక్క.. గుంటూరు జీజీహెచ్ లో ఏడుగురు బాధితులు ఈ సమస్యతో చేరగా.. ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.

మిగిలినవారిలో గుంటూరు జిల్లాకు చెందిన కమలమ్మ (40) వెంటిలేటర్ పై ఉండగా.. ఆశీర్వాదం (50), షేక్ గౌర్జాన్ (50), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన నాగవేణి (20), పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన రమీజాన్ (44) లకు న్యూరాలజీ, జనరల్ మెడిసిన్ విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలా గుంటూరులో ఏడుగురు ఈ వ్యాధి బారిన పడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య సాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్సి కృష్ణబాబు స్వయంగా జీజీహెచ్ కు వచ్చి పరిస్థితిని ఆరా తీశారు. మొత్తంగా... రాష్ట్ర వ్యాప్తంగా... గుంటూరులో 5, విశాఖలో 6, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కోటి చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు!

ఈ సందర్భంగా స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్... జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వీటికి సంబంధించిన ఇంజెక్షన్లు తీసుకోకుండానే 80 శాతం మంది రికవరీ అయ్యారని వెల్లడించారు. ఇదే సమయంలో.. వీటికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8వేల వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

జీబీఎస్ లక్షణాలు!:

ప్రధానంగా కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుందని.. క్రమంగా వీపు భాగం, మెడకండరాలు, చేతులు పూర్తిగా అచేతనమవుతుందని చెబుతున్నారు. ఈ సందర్భంగా.. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడటం, ఆహారం మింగడం కష్టమవుతుందని.. ముఖంలో కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేనట్లుగా అనిపిస్తుందని చెబుతున్నారు.

ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని.. తీవ్రత స్వల్పంగా ఉంటే నడవడం కాస్త కష్టమవుతుందని.. మరీ ఎక్కువైతే బాధితులు మంచానికి పరిమితమవుతారని చెబుతున్నారు. శరీరంలో పొటాషియం లేదా కాల్షియం తగ్గితే జీబీఎస్ లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయని.. అవి భర్తీ అయితే సమస్య సమసిపోతోందని చెబుతున్నారు.