కూటమిలో ఆ 'కమిషనర్' చిచ్చు!
తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో కూటమిలో చిచ్చు రాజుకుంది.
By: Tupaki Desk | 29 Sep 2024 10:08 AM GMTఈ ఏడాది మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల ఈ మూడు పార్టీల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఉద్యోగుల బదిలీలు, నియామకాల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు.
తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో కూటమిలో చిచ్చు రాజుకుంది. ధర్మవరం అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టారు. బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య శాఖల మంత్రిగా ఉన్నారు.
కాగా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. బీజేపీతో పొత్తు కుదరకుంటే ధర్మవరం నుంచి అసెంబ్లీకి ఆయనే పోటీ చేసే వారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నియమితులయిన మల్లికార్జున నియామకం కూటమిలో చిచ్చు రేపింది.
మల్లికార్జునకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మద్దతు ఉండటంతో ఆయనను ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా నియమించుకున్నారు. అయితే ఈ నియామకాన్ని పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ క్రమంలో తాజాగా ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కూడా హాజరయ్యారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయి. కమిషనర్ ను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న సత్యకుమార్ సమావేశాన్ని మున్సిపల్ ఆఫీసులో కాకుండా మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్డీయే కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అక్కడికే మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఇతర అధికారులు కూడా వెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కమిషనర్ మల్లికార్జునను కార్యాలయం వెనుక గేట్ నుంచి బందోబస్తుతో పంపించేశారు.
ఈ క్రమంలో టీడీపీ నేతలు సత్యకుమార్ పై మండిపడ్డారు. తాము కష్టపడి గెలిపిస్తే మంత్రివి అయ్యావన్నారు. ఇప్పుడు మంత్రి, అనుచరులు తమపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి సత్యకుమార్ ముందుకు కదలకుండా ఆయన వాహనాన్ని చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను నెట్టివేసి మంత్రిని పంపించేశారు.
అనంతరం టీడీపీ కార్యకర్తలు ధర్మవరం–అనంతపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. డీఎస్పీ శ్రీనివాసులు రంగప్రవేశం చేసి వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా టీడీపీ శ్రేణులు పట్టించుకోలేదు. బీజేపీ, టీడీపీ విభేదాల కారణంగా ధర్మవరం పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
కాగా మంత్రి సత్యకుమార్.. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను వెనకేసుకొచ్చారు. ఆయన సమర్థుడైన అధికారి అని ప్రశంసలు కురిపించారు.
ధర్మవరం అభివృద్ధికి అతడిలాంటి అధికారి అవసరమన్నారు. గత ప్రభుత్వంలో పని చేశారన్న కారణంతో కొన్ని పార్టీల నాయకులు ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. అధికారులకు రాజకీయాలను ఆపాదించకూడదని తెలిపారు.