ఆ మంత్రిగారి కోరిక.. చంద్రబాబు నెరవేరుస్తారా.. ?
ప్రజల కోరికలు నెరవేర్చడమే కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రుల కోరికలు నెరవేర్చడం కూడా ముఖ్యమంత్రి బాధ్యతే
By: Tupaki Desk | 5 Oct 2024 3:30 PM GMTప్రజల కోరికలు నెరవేర్చడమే కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రుల కోరికలు నెరవేర్చడం కూడా ముఖ్యమంత్రి బాధ్యతే. ఇప్పుడు అలాంటి సందర్భమే చంద్రబాబుకు వచ్చింది. బీజేపీ నాయకుడు, ధర్మవరం ఎమ్మె ల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్.. బలమైన కోరికనే సీఎం చంద్రబాబు ముందు పెట్టారు. సాధారణంగా ఒక ఎమ్మెల్యే ఏదైనా కొరిక కోరితే.. దానిని పక్కన పెట్టినా ఇబ్బంది లేదు. ఎందుకంటే.. ఎమ్మెల్యే-చంద్రబాబుకు నిత్యం కనిపించరు.
అదేవిధంగా ప్రతిరోజూ ఆ ఎమ్మెల్యే అడిగిన సమస్య గుర్తు చేసేందుకు కూడా అవకాశం లేదు. కానీ, సాక్షా త్తూ మంత్రి, పైగా కూటమి పార్టీ నాయకుడు కావడంతో చంద్రబాబు ఈ సమస్య అనునిత్యం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఆయన కనిపించినప్పుడల్లా ఆ సమస్య పరిష్కారం పై ప్రశ్నించే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. సరే.. ఇంతకీ మంత్రి అడిగిన కోరిక.. కడప జిల్లా పేరును తిరిగి పునరుద్ధరించాలని!
వైసీపీ హయాంలో జిల్లాలను విభజన చేసినప్పుడు.. అప్పటి వరకు కూడా ఉన్న `వైఎస్సార్ కడప` జిల్లా పేరును మార్చేసి.. అసలు కడప అనేది లేకుండా చేశారు. వైఎస్సార్ జిల్లాగా మార్చారు. దీని నుంచి విడివడిన మరికొన్ని ప్రాంతాలను కలిపి అన్నమయ్య జిల్లాగా పేరు మార్చారు. వాస్తవానికి `వైఎస్సార్ కడప` జిల్లా అనేది రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టారు. వైఎస్ మరణంతో ఆయన స్మృతిగా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు.. రోశయ్య సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే.. జగన్ అసలు `కడప` అన్న పేరునే తొలగించారు. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ మాత్రం వైఎస్సార్ పేరును పూర్తిగా తీసేసి.. కడప జిల్లాగా మార్చాలని కోరుతున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే.. వైఎస్సార్ కడప అని అయినా ఉంచాలని కోరుతున్నారు. నిజానికి వైఎస్సార్ పేరును చాలా వాటికి ఇప్పటికే తొలగించారు. అయితే.. జిల్లాతో ఆయనకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఇప్పుడు ఆ పేరును తొలగిస్తే.. రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు భావించవచ్చు. అందుకే ఈ విషయం పై ఎలా స్పందిస్తారనేది చూడాలి.