ప్రపంచ కప్ ఓటమిపై సత్య నాదెళ్ల... ఆసిస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు!
ఎంత అనుకున్నా.. ఏమి అనుకున్నా.. తాజాగా జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో భారత్ ఓటమి గురించిన చర్చ మరికొంతకాలం జరుగుతూనే ఉంటుంది.
By: Tupaki Desk | 22 Nov 2023 3:42 AM GMTఎంత అనుకున్నా.. ఏమి అనుకున్నా.. తాజాగా జరిగిన వన్ డే వరల్డ్ కప్ లో భారత్ ఓటమి గురించిన చర్చ మరికొంతకాలం జరుగుతూనే ఉంటుంది. కనీసం మరో టోర్నమెంట్ ప్రారంభం అయేవరకైనా దీనికి సంబందించిన ప్రశ్నలు, జవాబులు, విశ్లేషణలు, ఆవేదనలు మీడియాలో ఏదో ఒక మూల కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటాయి. కారణం... క్రికెట్ కు భారత్ కూ ఉన్న సంబందం అలాంటిది అవ్వడమే!
మామూలుగానే టీం ఇండియా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ అంటేనే.. ఫ్యాన్స్ దానిగురించే మాట్లాడుకుంటారు. ఇక వరల్డ్ కప్ లో ఆడిన 10 మ్యాచ్ లలోనూ వరుసగా గెలిచిన తర్వాత జరగబోయే ఫైనల్ మ్యాచ్ అనే సరికి... ఆ ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే... ఆ మ్యాచ్ లో టీం ఇండియా ఓటమి పాలైంది. తాజాగా ఈ విషయంపై సత్య నాదెళ్ల స్పందించారు.
అవును... తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో సత్య నాదెళ్ల మాట్లాడుతుండగా.. అక్కడున్న వ్యాఖ్యాత వరల్డ్ కప్ గురించి ప్రస్తావించారు. ఇందులో భాగంగా... భారత్ ఓటమిని గుర్తుచేశారు. ప్రతీకారంగా.. ఆస్ట్రేలియాను కొనేస్తారా? అని సరదాగా ప్రశ్నించారు. దీనికి నాదెళ్ల ఆసక్తికరంగా స్పందించారు. ఆస్ట్రేలియాను.. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నూ పోలుస్తూ తనదైన శైలిలో స్పందించారు.
ఇందులో భాగంగా... ఆస్ట్రేలియాను కొనడం అంటే ఓపెన్ ఏఐ ను సొంతం చేసుకోవడంతో సమానం. వాస్తవానికి ఆ రెండూ కూడా సాధ్యం కాదు. కానీ, ఓపెన్ ఏఐ తో తాము భాగస్వాములం కాగలం. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్ ఆడడాన్నీ ఆనందించగలం అని నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో.. ఈ రియాక్షన్ ఆసక్తికరంగా మారిందనే కామెంట్లను సొంతం చేసుకుంటుంది.
కాగా... మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల క్రికెట్ అభిమాని అనే సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ క్రమంలో గత బుధవారం న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ను రాత్రంతా మేల్కొని మరీ చూసినట్లు స్వయంగా ప్రకటించారు. ఇదే సమయంలో ఫైనల్ మ్యాచ్ ను వీక్షించారు.
ఆ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచిన అనంతరం ఆయన "ఎక్స్" వేదికగా స్పందిస్తూ... వారికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకెళ్లిన టీంఇండియాను అభినందించారు. మరోవైపు చాట్ జీపీటీ సృష్టికర్త శాం ఆల్ట్ మన్ ను ఇటీవల ఓపెన్ ఏఐ సీఈఓ పదవి నుంచి తొలగించగా... ఆయనను మైక్రోసాఫ్ట్ నూతన ఏఐ బృందంలోకి తీసుకుంటున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.