టికెట్ ఇవ్వలేదు.. అయినా నా శవంపై టీడీపీ జెండానే!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.
By: Tupaki Desk | 30 March 2024 5:43 PM GMTటీడీపీలో టికెట్ల పందేరంపై పోరు కొనసాగుతూనే ఉంది. సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా.. అరువు తెచ్చుకున్న నాయకులకు, డబ్బున్న నేతలకు మాత్రమే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని పలువురు సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో సీనియర్ నాయకుడు, విశాఖకు చెందిన బండారు సత్యనారాయణ మూర్తి కూడా చేరిపోయారు. తాజాగా చంద్రబాబుపై ఆయన నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన టీడీపీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.
''ఏం పాపం చేశానని నాకు టికెట్ ఇవ్వలేదు'' అని సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. తనకు టికెట్ రాకపోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని... తాను ఏం పాపం చేశానని టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్టీలు మారిన నేతలకు టికెట్ కేటాయించారని, కోట్లకు పడగలెత్తిన వారికి టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తాను పోటీ చేయకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు.
గత 26 రోజులుగా తనకు నిద్ర లేదని బండారు వ్యాఖ్యానించారు. తనపై జగన్ ప్రభుత్వం 11 కేసులు పెట్టినా భయపడలేదని... ప్రభుత్వంపై పోరాటం చేశానని చెప్పారు. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే.. టికెట్లు ఇవ్వకుండా వేదించడంతో కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నామని.. వారికి మొహం కూడా చూపించలేక పోతున్నామని అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా రియలైజ్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
నా శవంపైనా టీడీపీ జెండానే!
బండారుకు టీడీపీ టికెట్ రాకపోవడంతో ఆయన ఆ పార్టీని వీడి వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ వైసీపీ నుంచి తనకు ఆఫర్లు వచ్చాయని తెలిపారు. అయితే ఆ ఆఫర్లను తాను తిరస్కరించానని చెప్పారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని... తన కట్టె కాలేంత వరకు తాను పసుపు జెండా మోస్తూనే ఉంటానని అన్నారు. తన చితి మీద కూడా పసుపు జెండా వేసి దహన కార్యక్రమం నిర్వహించాలని భావోద్వేగానికి గురయ్యారు. ''నా శవంపైనా టీడీపీ జెండానే కప్పాలి. టికెట్ ఇవ్వడం అనేది అధినేత ఇష్టం. మేం మాత్రం టీడీపీలోనే ఉంటాం'' అని ఆయన వ్యాఖ్యానించారు.