సంయమనం పాటించాలి మంత్రివర్యా!!
ఇవి ఆయన స్థాయికి, ముఖ్యంగా మంత్రి స్థాయికి ఏమాత్రం తగవనే వాదన వినిపిస్తోంది.
By: Tupaki Desk | 17 Jun 2024 1:30 AM GMTఅదిగో పులి.. అంటే తోక.. అనే టైపులో వైసీపీ మంత్రులు, నాయకులు వ్యవహరించిన నేపథ్యంలోనే ప్రజలు వారిని పక్కన పెట్టారు. ఈ విషయం టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు కూడా తెలుసు. అయినా.. ఇప్పుడు ఎందుకో తొందర పడుతున్నారు. వైసీపీ మంత్రులు, నేతల మాదిరిగా టీడీపీ నాయకు లు వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. `సంకల్పం చెప్పుకోవడం సరే.. పాటించాలి` అన్న నియమా న్ని మంత్రులు కూడా విస్మరిస్తున్నారు.
తొలినాళ్లలోనే దూకుడు మంచిది కాదు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. తాజాగా టీడీపీ మం త్రి, ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నాయకుడు అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి ఆయన స్థాయికి, ముఖ్యంగా మంత్రి స్థాయికి ఏమాత్రం తగవనే వాదన వినిపిస్తోంది. గత సీఎం జగన్ తప్పులు చేసి ఉండొచ్చు. అందుకే కదా.. ప్రజలు ఇంత పెద్ద మాండేట్ ఇచ్చి.. కూటమి సర్కారును ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఈ విషయాన్ని మరిచిపోతున్నట్టుగా మంత్రి వ్యవహరించారు.
``జగన్.. ఫర్నిచర్ దొంగ`` అని మంత్రి అనగాని అనేశారు. ఇది రాజకీయంగా ఆయనకు మెప్పు తీసుకు వచ్చినా.. ప్రజల్లో అంత మెప్పు అయితే రాకపోవచ్చు. ఎందుకంటే.. జగన్‌పై ఇప్పుడిప్పుడే.. కొంత సాను భూతి ఏర్పడుతోంది. ఆయన ఓడిపోయిన దరిమిలా.. ఓ వర్గంలో ఆలోచన కూడా వస్తోంది. ఇలాంటి సమయంలో జగన్‌ను దొంగ అని వ్యాఖ్యానించి.. మంత్రిగా ఆయన రెండు మెట్లు దిగాల్సిన అవసరం లేదు. పైగా.. ఇది ఎలానూ సర్కారు దృష్టిలో ఉంది. అటు వైపు నుంచి కూడా.. `ఖరీదు కట్టండి-ఇచ్చేస్తాం` అని అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
ఈ క్రమంలో అనగాని వంటి సీనియర్లు, వివేచన ఉన్న నాయకులు `దొంగ` అనడం వల్ల టీడీపీకి వచ్చే సానుభూతి ఏమీలేదు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. పైగా.. అసలు నిబంధనలు పార్టీ వర్గాలకు లేదా.. ఆరోపణలు చేసిన వారికి తెలియకపోవచ్చు. కానీ, మంత్రిగా మాత్రం నిబంధనలు కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది. తమ్ముడు తనవాడే అయినా.. పరాయివాడే అయినా.. నిబంధనలు కామనే కదా! అవి ఏం చెబుతున్నాయో చూడండి.
ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి.. అధికారంలో ఉండగా కేటాయించిన ఇళ్లను వాడుకునే అవకాశం ఉంది. వాటిలో ఫర్నిచర్ కొనుగోలు చేసుకునేందుకు నిబంధనల ప్రకారం.. ప్రజాధనాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. ఒకవేళ సదరు నేత తాలూకు పార్టీ అధికారం కోల్పోతే.. ఆ ఇంటిని.. ఫర్నిచర్‌ను అప్పగించాలి. దీనికి నిబంధనల మేరకు ఆరు మాసాల వరకు గడువు ఉంటుంది. ఇది ఎవరికైనా వర్తిస్తుంది.
ఈ ఆరు మాసాల గడువు కూడా పూర్తయి.. అప్పటికీ ఖాళీ చేయకపో తే.. ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి... బలవంతంగా తీసుకునే హక్కు కూడా పసర్కారుకు ఉంటుంది. కానీ.. ఇంతలోనే ఇలా తొందరపడితే.. అది సర్కారు దూకుడుగానో..లేక మరో కక్ష సాధింపుగానో.. ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మంత్రిగా ఉన్న అనగాని ఇతరులు గుర్తించాల్సి ఉంటుంది.