గన్నవరం గ్యాంగ్ @ నేపాల్
రాష్ట్రంలో సంచలనం రేపిన ముదునూరు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నలుగురు కీలక నిందితులు నేపాల్ పారిపోయినట్లు ఏపీ పోలీసులు గుర్తించారు.
By: Tupaki Desk | 7 April 2025 3:21 PMరాష్ట్రంలో సంచలనం రేపిన ముదునూరు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో నలుగురు కీలక నిందితులు నేపాల్ పారిపోయినట్లు ఏపీ పోలీసులు గుర్తించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముఖ్య అనుచరులైన వీరు, ఆయన అరెస్టు అయిన మరుక్షణమే రాష్ట్రం నుంచి పారిపోయి నేపాల్ లో తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి కదలికలపై నిఘా వేసిన పోలీసులు.. నేపాల్ నుంచి రాత్రి సమయంలో గన్నవరానికి ఫోన్ కాల్స్ వస్తున్నట్లు విజయవాడ పోలీసులు గుర్తించారు. దీంతో పక్కదేశంలో తలదాచుకున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు చేసినందుకు గాను అప్పట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ముదునూరు సత్యవర్థన్ ను మాజీ ఎమ్మెల్యే వంశీతోపాటు ఆయన అనుచరులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇందులో మొత్తం 12 మందిని నిందితులుగా గుర్తించగా, మాజీ ఎమ్మెల్యే వంశీతోపాటు ఆయన అనుచరుల్లో మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు. మిగిలిన ఐదుగురు ఇన్నాళ్లు పరారీలో ఉండగా, వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడైన ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగా కొద్దిరోజుల క్రితం వేరే కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు అయిన వెంటనే రంగా పారిపోయాడు. ఆయన కదలికలపై నిఘా వేసిన పోలీసులు ఏలూరులో అతడి ఆచూకిని గుర్తించారు. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో రిమాండుకు తరలించడంతో కిడ్నాప్ కేసులో అరెస్టు పెండింగులో ఉండిపోయింది. నేడో రేపో రంగాను పీటీ వారెంటుపై అదుపులోకి తీసుకుని కిడ్నాప్ కేసులో అరెస్టు చూపే అవకాశం ఉందంటున్నారు. ఇక మిగిలిన నలుగురిలో ప్రధానమైన నిందితుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కొట్లుగా చెబుతున్నారు.
సత్యవర్థన్ కిడ్నాప్ వ్యవహారంలో కొమ్మా కోట్లు కీలక పాత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. సత్యవర్థన్ ను విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లడం, అక్కడి నుంచి తిరిగి విశాఖకు తరలించడం వంటివన్నీ కోట్లు ఆధ్వర్యంలోనే జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కొమ్మా కోట్లు అండర్ గ్రౌండుకు వెళ్లిపోయాడని చెబుతున్నారు. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా పోలీసుల నుంచి తప్పించుకుతిరుగుతున్నారు. వీరంతా రాష్ట్రం నుంచి పారిపోయి నేపాల్ చేరినట్లు అనుమానిస్తున్నారు. ఆ దేశం నుంచి గత కొంతకాలంగా విజయవాడ, గన్నవరంలోని నిందితుల బంధువులు, స్నేహితులకు ఫోన్లు వస్తున్నట్లు గుర్తించారు. కేసు వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని అంటున్నారు. దీంతో విజయవాడ పోలీసులు నేపాల్ పై ఫోకస్ చేశారు. వారు ఎక్కడ దాక్కుందీ పక్కాగా తెలుసుకుని అరెస్టు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.