ఓటర్లకు ప్రలోభం.. తెలంగాణ మహిళా మంత్రిపై కేసు!
నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని దూకుడుగా నిర్వహిస్తున్నారు
By: Tupaki Desk | 18 Nov 2023 5:20 AM GMTనవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని దూకుడుగా నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ గెలుపే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టే పనులు జరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ గిరిజన, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పై గూడూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ ఫ్లయింగ్ స్క్వాడ్ చేసిన ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
మహబూబాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ తరఫున ప్రచారం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల కొంగరగిద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలు ఆమెకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. ఈ క్రమంలో సత్యవతి రాథోడ్ హారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
కాగా మహబూబాబాద్ బీఆర్‌ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ కు మద్దతుగా కొంగరగిద్ద గ్రామానికి వెళ్లిన ఆమెకు కొందరు మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కారులో కూర్చున్న మంత్రి.. మహిళలు తీసుకువెళ్తున్న మంగళహారతి ప్లేటుపై రూ.4వేలు వేశారు.
ఈ వీడియో ఫుటేజీ ఆధారంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
దీంతో పోలీసులు మంత్రి సత్యవతి రాథోడ్ పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 171 E, 171 H) R/W సెక్షన్ 188, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 (1) కింద కేసు నమోదు చేశారు.
కాగా 2009లో టీడీపీ తరఫున డోర్నకల్ నుంచి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఆమె బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రెడ్యా నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అంతేకాకుండా మంత్రి పదవిని అప్పగించారు.